Mamata: మహువా వివాదం.. మౌనం వీడిన మమతా బెనర్జీ!

లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Published : 23 Nov 2023 16:32 IST

కోల్‌కతా: సొమ్ములు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు (Cash for Query) లేవనెత్తారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) వివాదంపై పార్టీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎట్టకేలకు మౌనం వీడారు. లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కానీ, లోక్‌సభ ఎన్నికల ముందు ఇవి ఆమెకు సహాయపడతాయన్నారు. కోల్‌కతాలోని నేతాజీ స్టేడియంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ.. మహువా వ్యవహారంపై తొలిసారి స్పందించారు.

‘విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న కేంద్ర సంస్థలు.. 2024 ఎన్నికల తర్వాత భాజపాతోనే వెళ్తాయి. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఉండేది మరో మూడు నెలలే. వివిధ కేసుల్లో మా పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారు. ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆమెకు సాయం చేస్తుంది’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

అలా ఐతే భారత్‌ గెలిచేది..!

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోల్‌కతా లేదా ముంబయిలో జరిగితే భారత్‌ విజయం సాధించి ఉండేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. భారత ఆటగాళ్లను చూసి గర్వపడుతున్నామని అన్నారు. దేశం మొత్తాన్ని కాషాయీకరణ చేయాలని భాజపా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఆటగాళ్ల జెర్సీలు మొదలు, కొన్ని రైళ్లనూ ఆ రంగులోనే రూపొందిస్తున్నారని విమర్శించారు.

మొయిత్రాపై ఆరోపణలు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ మౌనం

ఇదిలాఉంటే, డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని లోక్‌సభ నైతిక విలువల కమిటీ సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై తొలినుంచి మౌనంగా ఉంటోన్న తృణమూల్‌ కాంగ్రెస్‌.. కొన్నిరోజుల నుంచి ఆమెకు మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఇటీవలే మహువాకు పార్టీలో కొత్తబాధ్యతలు అప్పగించిన టీఎంసీ.. ఓ జిల్లాకు పార్టీ అధ్యక్షురాలిగా నియమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని