Chandrayaan 3: ‘మిత్రమా.. స్వాగతం!’.. చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌తో ల్యాండర్‌ అనుసంధానం

చంద్రయాన్‌-2 మిషన్‌లో భాగంగా పంపించిన ఆర్బిటర్‌తో చంద్రయాన్‌-3కి చెందిన ల్యాండర్‌ మాడ్యుల్‌ను విజయవంతంగా అనుసంధానించారు. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్‌ చేసింది.

Published : 21 Aug 2023 16:55 IST

బెంగళూరు: చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ల్యాండర్‌ ‘విక్రమ్‌’.. జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇందుకు అనువైన ప్రదేశం కోసం ల్యాండర్‌ (Vikram Lander) అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం కీలక ప్రక్రియ చేపట్టారు. 2019లో చంద్రయాన్‌-2 మిషన్‌లో భాగంగా పంపించిన ఆర్బిటర్‌ (Chandrayaan-2 Orbiter).. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆర్బిటర్‌తో చంద్రయాన్‌-3కి చెందిన ల్యాండర్‌ మాడ్యుల్‌ను విజయవంతంగా అనుసంధానించారు. ఈ మేరకు ఇస్రో (ISRO) ఓ ట్వీట్‌ చేసింది.

‘స్వాగతం.. మిత్రమా! చంద్రయాన్‌-2 ఆర్బిటర్.. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ మాడ్యుల్‌ను అధికారికంగా స్వాగతించింది. ఈ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి వ్యవస్థ స్థాపితమైంది. ల్యాండర్‌ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్కింగ్‌ కేంద్రాని(MOX ISTRAC)కి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయి’ అని ఇస్రో పేర్కొంది. మరోవైపు.. సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం 5:20 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. అదే రోజు సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.

భూమికి కన్పించని జాబిల్లి అవతలి వైపు.. ఫొటోలు పంపిన ల్యాండర్‌

ఇదిలా ఉండగా.. చంద్రయాన్‌-2 మిషన్‌ను భారత్‌.. 2019 జులై 22న చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లతో కూడిన ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌-111 ఎం1’ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది చంద్రుడి కక్ష్యలోకి ఆగస్టు 20న ప్రవేశించింది. అయితే.. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చివరి క్షణాల్లో విఫలమైంది. కానీ, ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం చందమామ కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. దానిలో సరిపడా ఇంధనం ఉందని.. మరో ఏడేళ్లు సేవలు అందించడానికి ఇది సరిపోతుందని ఇస్రో అప్పట్లోనే తెలిపింది. ఈ నేపథ్యంలో.. చంద్రయాన్‌-3లో భాగంగా ఆర్బిటర్‌ను పంపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని