Chandrayaan-3: భూమికి కన్పించని జాబిల్లి అవతలి వైపు.. ఫొటోలు పంపిన ల్యాండర్‌

Chandrayaan-3: సాధారణంగా మనకు ఎప్పుడూ చంద్రుడి ఒకవైపే కన్పిస్తుంది. అవతలి వైపు కనిపించదు. ఇప్పుడు ఆ అవతలివైపు జాబిల్లి ఎలా ఉంటుందో మన చంద్రయాన్‌-3 ల్యాండర్‌.. ఫొటోలు తీసి పంపించింది.

Updated : 21 Aug 2023 10:28 IST

బెంగళూరు: చందమామ (Moon)పై కాలుపెట్టే చారిత్రక ఘట్టం కోసం చంద్రయాన్‌-3 (Chandrayaan-3) శరవేగంగా అడుగులు వేస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువం (Lunar South Pole)పై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram Lander) అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలోనే భూమికి ఎప్పుడూ కన్పించని జాబిల్లి అవతలివైపు (దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతం) చిత్రాలను ల్యాండర్‌ తన కెమెరాలో బంధించింది.

ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ISRO) తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకుంది. ‘‘విక్రమ్‌ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవైడెన్స్‌ కెమెరా (LHDAC).. భూమికి కన్పించని జాబిల్లి అవతలివైపు  ఫొటోలను తీసింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యే ప్రాంతాన్ని గుర్తించేందుకు ఈ కెమెరా సాయపడుతుంది. బండరాళ్లు, లోతైన కందకాలు లేని ప్రదేశం కోసం ల్యాండర్‌ అన్వేషిస్తోంది’’ అని ఇస్రో రాసుకొచ్చింది.

23న సాయంత్రం 6:04 గంటలకు.. చందమామపై దిగనున్న చంద్రయాన్‌-3

ఆగస్టు 19న ల్యాండర్‌ ఈ ఫొటోలు తీసినట్లు ఇస్రో (ISRO) వెల్లడించింది. తాజా ఫొటోల్లోనూ జాబిల్లి ఉపరితలంపై అనేక బిలాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వాటి పేర్లను ఇస్రో తాము విడుదల చేసిన ఫొటోల్లో పేర్కొంది. సాధారణంగా మనకు ఎప్పుడూ చంద్రుడి ఒకవైపే కన్పిస్తుంది. అవతలి వైపు కనిపించదు. చంద్రుడు తన కక్ష్య మీద ఒకసారి పూర్తిగా భ్రమించటానికి పట్టే సమయం, భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం సమానంగా ఉంటుంది. దీన్ని టైడల్‌ లాకింగ్‌ అంటారు. దీని మూలంగానే చంద్రుడి ఒక వైపే మనకు కనిపిస్తుంది.

ఇప్పుడు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3).. జాబిల్లి పైకి ఎవరూ వెళ్లని మార్గంలో దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ ధ్రువం దిశగా పయనిస్తోన్న ల్యాండర్‌ విక్రమ్‌.. జాబిల్లి అవతలివైపు దృశ్యాలను తీసింది. ప్రస్తుతం ల్యాండర్‌ జాబిల్లి చుట్టూ ఉన్న 25×134 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇది విజయవంతమైతే.. జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనా జాబితాలో భారత్‌ కూడా చేరనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని