Gold: విమానాశ్రయంలో 61 కిలోల బంగారం పట్టివేత.. ఏడుగురి అరెస్టు

మహారాష్ట్రలోని ముంబయిలో భారీగా బంగారం(Gold) పట్టుబడింది. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు(Customs Officers) సీజ్‌ చేశారు.

Published : 13 Nov 2022 21:25 IST

ముంబయి: ముంబయిలో భారీగా బంగారం(Gold) పట్టుబడింది. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు(Customs Officers) సీజ్‌ చేశారు. శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన ఆపరేషన్లలో భాగంగా రూ.32 కోట్ల విలువైన 61 కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అయితే, ఒక్కరోజులోనే ఇంత భారీ స్థాయిలో బంగారం స్వాధీనం చేసుకోవడం ముంబయి విమానాశ్రయం కస్టమ్స్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

తొలి ఆపరేషన్‌లో టాంజానియా నుంచి వస్తున్న నలుగురు భారతీయులు కిలో చొప్పున ఉండే బంగారు కడ్డీలను తీసుకెళ్తున్నట్టు గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, 53 కడ్డీల రూపంలో ఉన్న 53 కిలోల బంగారాన్ని ప్రత్యేకంగా చేయించిన బెల్ట్‌లలో దాచి ఉంచగా సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.28.17కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. దోహా విమానాశ్రయంలో ఓ సూడన్‌ జాతీయుడు వీరికి బెల్ట్‌లను అందజేశాడని తెలిపారు. ఈ నలుగురికీ కోర్టు 14రోజుల రిమాండ్‌ విధించిందన్నారు. అలాగే, రెండో ఆపరేషన్‌లో దుబాయి నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.3.88 కోట్లు విలువ చేసే 8కిలోల బంగారాన్ని సీజ్‌ చేసినట్టు చెప్పారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నట్టు పేర్కొన్నారు. మైనం రూపంలో ఉన్న బంగారాన్ని తీసుకెళ్తుండగా వీరిని పట్టుకున్నట్టు చెప్పారు. వారు ధరించిన జీన్స్‌లో బంగారాన్ని దాచి తీసుకెళ్తుండగా గుర్తించి సీజ్‌ చేసినట్టు తెలిపారు. వీరిలో ఒక మహిళ వయస్సు 60 ఏళ్లకు పైగా ఉంటుందని.. ఆమె వీల్‌ ఛైర్‌లో ఉన్నట్టు చెప్పారు. వీరిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని