Delhi: దిల్లీవాసుల నిర్లక్ష్యం.. ‘వర్షం ఊరట’ను తుడిచిపెట్టిన టపాసుల మోత

Delhi Pollution: దిల్లీలో మళ్లీ వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి వేళ ప్రజలు టపాసులు పేల్చడంతో గాలి నాణ్యత పడిపోయింది. బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం.

Updated : 13 Nov 2023 12:11 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ కాలుష్య (Delhi Air Pollution) కోరల నుంచి కాస్త బయటపడిందని ఊపిరిపీల్చుకునేలోపే.. దీపావళి తర్వాత పరిస్థితులు మళ్లీ ప్రమాదకరంగా మారాయి. సుప్రీంకోర్టు (Supreme Court) నిషేధాన్ని కూడా పక్కనబెట్టి దిల్లీ వాసులు టపాసుల (firecrackers) మోత మోగించారు. దీంతో సోమవారం ఉదయం రాజధాని, దాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది.

గత వారాంతంలో దిల్లీ (Delhi)లో మోస్తరు వర్షాలు కురవడంతో వాయు నాణ్యత (AQI) సూచీ కాస్త మెరుగుపడింది. ఆదివారం సాయంత్రం వరకూ ఏక్యూఐ 218గానే నమోదైంది. కానీ, ఆ తర్వాత దీపావళి పండగను పురస్కరించుకుని దిల్లీ వాసులు బాణసంచా పేల్చారు. కాలుష్య పరిస్థితుల దృష్ట్యా దిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు పూర్తి నిషేధం విధించినప్పటికీ.. చాలా చోట్ల అర్ధరాత్రి వరకు బాణసంచా మోత మోగింది. దీంతో సోమవారం ఉదయానికి దిల్లీలో గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది. పలు ప్రాంతాల్లో విషపూరిత పొగ మంచు కమ్మేయడంతో వాహనదారులకు మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.

ఆ ఏడు గ్రామాల్లో.. నిశ్శబ్ద దీపావళి!

ఈ ఉదయం చాలా చోట్ల ఏక్యూఐ సూచీ 500 దాటగా.. లజ్‌పత్‌ నగర్‌లో వాయు నాణ్యత సూచీ ఏకంగా 959కి పడిపోయింది. జవహర్‌లాల్‌ నెహ్రూ నగర్‌లో 910, కరోల్‌ బాఘ్‌లో 779గా ఉంది. ఊపిరితిత్తులను పాడుచేసే అతిసూక్ష్మ ధూళికణాలుగా పేర్కొనే పీఎం2.5 కణాల సాంద్రత 24 గంటల్లోనే 140శాతం పెరిగింది. ఆదివారం ఉదయానికి ఈ సాంద్రత సగటున క్యూబిక్‌ మీటర్‌కు 83.5గా ఉండగా.. ఈ ఉదయానికి అది 200.8కి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాలు వెల్లడించాయి.

దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు నిన్న రాత్రి విపరీతంగా బాణసంచా పేల్చడమే ఈ పరిస్థితికి కారణమైందని పలువురు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిషేధాన్ని అమలు చేయడంలో దిల్లీ అధికారులు విఫలమయ్యారని దుయ్యబడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు