Covid: క్షయపై పోరుకు కొవిడ్‌ అడ్డు

‘కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు పెద్దసంఖ్యలో సొంత ఊళ్లకు చేరారు.

Updated : 21 Dec 2022 17:05 IST

ఏడాదికాలంగా తగ్గిన రోగుల గుర్తింపు 
పౌష్టికాహార లోపంతో వలస కార్మికులకు ముప్పు

ఈనాడు, దిల్లీ: ‘కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు పెద్దసంఖ్యలో సొంత ఊళ్లకు చేరారు. వీరు ఆదాయం కోల్పోవడం వల్ల సరైన ఆహారం తీసుకోలేరు. ఫలితంగా పౌష్టికాహారలోపం తలెత్తి క్షయ (టీబీ) ముప్పును మరింత పెంచుతుంది’ అని ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐజేఎంఆర్‌) తన సంపాదకీయంలో తెలిపింది. కొవిడ్‌ కారణంగా క్షయ నియంత్రణకు ప్రాధాన్యం తగ్గినట్లు పేర్కొంది. అంటే.. క్షయకు వ్యతిరేకంగా 12 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చేస్తూ వస్తున్న పోరాటాన్ని 12 నెలల కొవిడ్‌ కాలం పూర్తిగా దెబ్బతీసింది. ‘డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం.. క్షయ తీవ్రత అత్యధికంగా ఉన్న పది దేశాల్లో 14 లక్షల ప్రజలకు 2020లో టీబీ వైద్యం అందలేదు. ఈ దేశాల్లో 2019లో 63 లక్షల కేసులు వెలుగులోకి రాగా.. 2020లో ఆ సంఖ్య 49 లక్షలకు తగ్గింది. మొత్తంగా ఈ రెండేళ్ల మధ్యలో క్షయ కేసుల నోటిఫికేషన్లు 21% మేర తగ్గాయి. భారత్‌లో ఈ సంఖ్య 25% మేర తగ్గింది. క్షయను రూపుమాపే కార్యక్రమం సరైన దారిలో నడుస్తున్న సమయంలో కొవిడ్‌ వచ్చి అలజడి రేపింది. 2020 చివరికల్లా క్షయకు ముగింపు పలకాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని దెబ్బతీసింది.

మరీ ముఖ్యంగా క్షయ కేసులు అత్యధికంగా ఉన్న ఇండియా, ఇండోనేసియా, చైనాలు ఈ విషయంలో వెనుకబడి ఉన్నాయి. ఇందువల్ల టీబీ టెస్టింగ్, ట్రీట్‌మెంట్, నియంత్రణ, పరిశోధన సామర్థ్యాలు పెంచడం కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. 2019తో పోలిస్తే 2020లో క్షయను గుర్తించి, చికిత్స అందించినవారి సంఖ్య 10 లక్షలమేర తగ్గింది. మరోవైపు.. దక్షిణాఫ్రికా, భారత్‌లలో కేవలం క్షయ ఉన్నవారితో పోలిస్తే కొవిడ్‌ సోకినవారిలో మరణాలు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందువల్ల క్షయ జాతీయ కార్యక్రమాలు నిర్వహించే అన్ని ప్రభుత్వ సంస్థలు ఇటు కొవిడ్‌-19ను ఎదుర్కొంటూనే.. అటు క్షయ నిర్మూలన కార్యక్రమాలను కూడా ప్రారంభించాలని ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని