సీబీఐపై ఈసీకి తృణమూల్‌ ఫిర్యాదు

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

Updated : 28 Apr 2024 06:37 IST

సందేశ్‌ఖాలీలో ‘ఆయుధాల స్వాధీనం’ కుట్రగా ఆరోపణ
బెంగాల్‌లో పటాకులు పేలినా కేంద్ర సంస్థల ఆరా : మమత

కోల్‌కతా, కుల్టీ: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. లోక్‌సభ ఎన్నికల సమయం కావడంతో టీఎంసీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేసేందుకు కేంద్రంలోని భాజపా సర్కారు ఉద్దేశపూర్వక దాడులతో సీబీఐని ప్రయోగించినట్లు ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి ఫిర్యాదు లేఖను అందజేసింది. ‘‘శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. శుక్రవారం రెండోదశ పోలింగు కొనసాగుతున్న వేళ మాకు ఎలాంటి సమాచారం లేకుండా సందేశ్‌ఖాలీలోని ఖాళీ ప్రదేశంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. నేషనల్‌ సెక్యూరిటీ గార్డుకు చెందిన బాంబ్‌స్క్వాడుతో సహా అదనపు బలగాలను దించింది. భారీసంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి బాంబ్‌స్క్వాడు అందుబాటులో ఉంది. అయినా సీబీఐ తన తనిఖీలకు ఎలాంటి సహాయం కోరలేదు’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నది టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్‌ షేక్‌ బంధువు ఇంట్లో అని మీడియాకు తప్పుడు సమాచారం అందించారని ఫిర్యాదులో తెలిపారు. సందేశ్‌ఖాలీలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయుధాల స్వాధీనానికి ఎలాంటి ఆధారాలు లేవని, సీబీఐ కారులోనే వాటిని తీసుకువచ్చి ఉంటారని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ శనివారం అనుమానం వ్యక్తం చేశారు. అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ..‘‘బెంగాల్‌లో పటాకులు పేలినా కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేస్తున్నాయి. చూస్తుంటే ఏదో యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంది. సందేశ్‌ఖాలీ వద్ద ఓ భాజపా నేత ఇంట్లోనూ బాంబులు నిల్వ చేసినట్లు నాకు సమాచారం అందింది’’ అన్నారు.

అరాచకం అంచున బెంగాల్‌ : భాజపా

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో ఉగ్రవాదులను, అత్యాచార నిందితులను కాపాడుతున్న టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అరాచకం అంచుకు తీసుకువెళుతోందని భాజపా శనివారం మండిపడింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్‌ శుక్లా దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ రాష్ట్ర పోలీసులు నేరగాళ్లకు అండగా ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. సందేశ్‌ఖాలీ అరాచకాలపై విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల మౌనాన్ని ఆయన తప్పుబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని