
పెళ్లిళ్లు వాయిదా వేసుకోండి..
మే 15వరకు అన్ని పనులూ ఆపేయాలని మధ్యప్రదేశ్ సీఎం విజ్ఞప్తి
భోపాల్: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న ‘కొవిడ్ కర్ఫ్యూ’ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పొడిగించారు. మే 15వరకు అన్ని పనులూ నిలిపివేయాలని ఆదేశించారు. కరోనా పరిస్థితిపై అధికారులు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన సీఎం... కరోనా కర్ఫ్యూని కఠినంగా అమలు చేయాలన్నారు. ‘‘మీ మద్దతు కావాలి. కరోనాతో మన దేశం, రాష్ట్రంతో పాటు ప్రపంచమంతా యుద్ధం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, పౌర సమాజ సంస్థలకు రుణపడి ఉంటా’’ అన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 25శాతం నుంచి 18శాతానికి తగ్గిందన్న సీఎం.. రికవరీ రేటు 58.12శాతంగా ఉందని తెలిపారు.
మే 15 వరకు అన్ని పనులు ఆపేయాలని కోరారు. వివాహాలను సైతం వాయిదా వేసుకోవాలన్నారు. ఇలాంటి వేడుకలు కరోనా వైరస్‌కు సూపర్ స్పెడర్‌లుగా మారుతున్నాయని చెప్పారు. ప్రజలు గుంపులుగా ఏర్పడకుండా అధికారులు కఠిన చర్యలు అమలుచేయాలని ఆదేశించారు. మానవత్వంపై కత్తులు దూస్తున్న కరోనాతో నెలకొన్న ఈ సంక్షోభ సమయంలో అందరం కలిసి పనిచేయాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అధికారులతో సమన్వయం చేసుకొనేందుకు వీలుగా.. ప్రతి గ్రామంలో చిన్నచిన్న బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చే గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిలిపివేయాలని ఆదేశించారు. కరోనా సోకిన విషయాన్ని చాలా మంది దాస్తున్నారని.. అలా చేయొద్దని విజ్ఞప్తి చేశారు.