Presidential Election: ‘రబ్బరు స్టాంపు’గా ఉండబోనని ప్రతిజ్ఞ చేయాలి: యశ్వంత్‌ సిన్హా

రాష్ట్రపతిగా ఎన్నికైతే ప్రభుత్వానికి ‘రబ్బరు స్టాంపు’గా ఉండబోనని ద్రౌపదీ ముర్ము ప్రతిజ్ఞ చేయాలంటూ యశ్వంత్‌ సిన్హా కోరారు........

Published : 04 Jul 2022 22:48 IST

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు (Presidential Election) సమీపిస్తున్న వేళ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా (Yashwant Sinha) ‘రబ్బరు స్టాంపు రాష్ట్రపతి’ విమర్శలకు పదునుపెట్టారు. ప్రభుత్వానికి ‘రబ్బరు స్టాంపు’గా కాకుండా ప్రజల కోసం పనిచేయగలరా? అంటూ ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu)ని ప్రశ్నించారు. ఒకవేళ గెలిస్తే ప్రభుత్వానికి రబ్బరు స్టాంపుగా ఉండబోనని ప్రతిజ్ఞ చేయాలంటూ కోరారు.

రాష్ట్రపతిగా తాను ఎన్నికైతే.. భారతీయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనస్సాక్షితో పనిచేస్తానని, రాజ్యాంగానికి కట్టుబడి ‘నిష్పక్షపాత సంరక్షకుని’గా ఉంటానని యశ్వంత్‌ సిన్హా ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. మౌనంగా ఉండబోనని, కేంద్ర ప్రభుత్వానికి రబ్బర్ స్టాంప్‌ రాష్ట్రపతిగా పనిచేయబోనని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. భాజపా రాష్ట్రపతి అభ్యర్థి సైతం ఈ తరహా ప్రతిజ్ఞ చేయాలంటూ సవాలు విసిరారు.

దేశంలో ప్రజాస్వామ్యం మరణశయ్యపై ఉందంటూ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అనంతరం సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని కాపాడేందుకే ప్రస్తుతం తాను ఎన్నికల బరిలో దిగినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తూ రాష్ట్రాల అధికారాలను లాగేసుకుంటోందని విమర్శించారు. దేశంలో ప్రతి వ్యవస్థనూ అవినీతిమయం చేసి బలహీనపరుస్తోందనీ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని