Vande Bharat: మేకల మందను ఢీకొట్టిందని.. ‘వందే భారత్‌’పై రాళ్లదాడి!

మేకల మందను ఢీకొట్టిందన్న కారణంతో ఓ వందేభారత్‌ రైలుపై రాళ్లదాడికి దిగారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 12 Jul 2023 02:05 IST

లఖ్‌నవూ: ‘వందే భారత్‌ (Vande Bharat)’ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై రాళ్లదాడుల (Stone Pelting) ఘటనలు చర్చనీయాంశంగా మారుతోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వందే భారత్‌పై ఈ తరహా దాడి జరిగింది. తమ మేకల మందను ఢీకొట్టిందన్న ఆగ్రహంతో కొంతమంది ఆ రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో రెండు బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు (RPF) తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గోరఖ్‌పుర్‌- లఖ్‌నవూ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం లఖ్‌నవూ బయల్దేరింది. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో సోహవాల్‌ ప్రాంతానికి చేరుకునేసరికి.. ముగ్గురు వ్యక్తులు దానిపైకి రాళ్లు విసిరారు. ఈ దాడిలో రెండు బోగీల కిటికీల అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే, రైలు మాత్రం గమ్యస్థానానికి చేరుకుంది. రాళ్లదాడి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను అరెస్టు చేశారు.

‘రైల్వే ట్రాక్‌పై గడ్డి మేస్తున్న సమయంలో వందేభారత్ రైలు ఢీకొని నన్హు పాసవాన్‌కు చెందిన మేకల మంద మృత్యువాతపడింది. ఆదివారం ఈ ఘటన జరిగింది. దీనిపై ఆగ్రహంగా ఉన్న పాసవాన్, అతని ఇద్దరు కుమారులు.. ఈ రైలును లక్ష్యంగా చేసుకున్నారు. మంగళవారం ఉదయం రాళ్లు విసిరారు’ అని రైల్వే పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గోరఖ్‌పుర్‌- లఖ్‌నవూ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జులై 7న వర్చువల్‌గా ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని