Vande Bharat Express: ఈ రూట్లలో వందేభారత్‌ రైళ్ల టికెట్‌ ధరలు తగ్గించే ఛాన్స్‌!

Vande Bharat Express Ticket price: తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రూట్లలో వందే భారత్‌ టికెట్‌ ధరలను తగ్గించాలని రైల్వే శాఖ చూస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయా రూట్లలో ఆక్యుపెన్సీ పెంచాలని ఆలోచన చేస్తోంది.

Published : 06 Jul 2023 01:53 IST

దిల్లీ: దేశంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల (Vande Bharat Express) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో 23 రైళ్లను కేంద్రం ప్రారంభించింది. మరికొన్ని రైళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రధాన రూట్లలో ఈ రైళ్లను నడుపుతున్నారు. ఈ సెమీ-హైస్పీడ్‌ రైళ్లు చాలా వరకు ఫుల్‌ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కొన్ని రూట్‌లలో మాత్రం ప్రయాణికుల నుంచి ఆదరణ అంతగా కనిపించడం లేదు. ముఖ్యంగా తక్కువ దూరం ప్రయాణించే రైళ్ల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న వందే భారత్‌ రైళ్లలో టికెట్‌ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ (Indian Railways) భావిస్తున్నట్లు సమాచారం. 

ఇందౌర్‌- భోపాల్‌, భోపాల్‌- జబల్‌పూర్‌, నాగ్‌పుర్‌- జబల్‌పుర్‌ వందే భారత్‌ రైళ్లు (Vande Bharat Express) ఈ కేటగిరీ కిందకు రానున్నాయి. జూన్‌ నెలకు సంబంధించి ఆయా రైళ్ల ఆక్యుపెన్సీని పరిశీలిస్తే.. భోపాల్‌- ఇందౌర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కేవలం 29 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా.. ఇందౌర్‌- భోపాల్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కేవలం 21 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేసింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 3 గంటలు కాగా.. ఏసీ ఛైర్‌కార్‌కు రూ.950, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ధర రూ.1525గా ఉంది. అయితే, ఆయా రైళ్ల టికెట్‌ ధరలను సమీక్షించనున్నట్లు ఓ అధికారి తెలిపారు.
Also Read: విజయవాడ - చెన్నై మధ్య వందేభారత్‌

‘దేశంలో చాలా వందే భారత్‌ రైళ్లు 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కొన్ని మాత్రమే తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ప్రయాణ సమయం ఉన్న రైళ్లలో టికెట్‌ ధరలు తగ్గిస్తే మరింత ఆదరణ సొంతం చేసుకుంటాయి. మరింత మంది ప్రయాణికులు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) వినియోగించుకునేలా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది’’ అని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

  • నాగ్‌పుర్‌- బిలాస్‌పుర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సగటు ఆక్యుపెన్సీ 55 శాతంగా ఉంది. ఈ రూట్‌లో ప్రయాణ సమయం 5.30 గంటలుగా ఉంది. ఒకవేళ ఈ రూట్లో టికెట్‌ ధరలు తగ్గిస్తే ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రూట్లో ఛైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ.1075 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.2045గా ఉంది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా మే నెలలో వందే భారత్‌ స్థానంలో తేజస్‌ రైలును ఈ రూట్‌లో తీసుకొచ్చారు.
  • ఇక భోపాల్‌- జబల్‌పుర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat)లో 32 శాతం ఆక్యుపెన్సీ ఉంది. జబల్‌పుర్‌- భోపాల్‌ వందే భారత్‌ ఆక్యుపెన్సీ రేషియో 36శాతంగా ఉంది. ఈ రూట్‌లో కూడా టికెట్‌ ధరలు తగ్గించే అవకాశం ఉంది. ఈ రూట్లో టికెట్‌ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1055 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ధర రూ.1880గా ఉంది.

టాప్‌ ఆక్యుపెన్సీ రూట్లు ఇవే..

ఆక్యుపెన్సీ విషయంలో కాసర్‌గోడ్‌-త్రివేండ్రం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్రస్థానంలో ఉంది. 183 శాతం ఆక్యుపెన్సీతో అన్ని రైళ్ల కంటే ముందుంది. త్రివేండ్రం- కాసర్‌గోడ్‌ (176 శాతం), గాంధీనగర్‌- ముంబయి సెంట్రల్‌ (134 శాతం), ముంబయి సెంట్రల్‌ - గాంధీనగర్‌ (129 శాతం), వారణాశి - న్యూదిల్లీ (128 శాతం), న్యూదిల్లీ - వారణాశి (124 శాతం), దేహ్రదూన్‌- అమృత్‌సర్ (105 శాతం), ముంబయి- షోలాపూర్‌ (111 శాతం), షోలాపూర్‌- ముంబయి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (104 శాతం) ఆక్యుపెన్సీ పరంగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక స్టేషన్‌ నుంచి ఒక స్టేషన్‌కు తీసుకునే టికెట్‌ను ఒక బుకింగ్‌గా, అక్కడి నుంచి మరో స్టేషన్‌ వరకు టికెట్‌ జారీ అయితే రెండో బుకింగ్‌గా లెక్కిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని