ఏసీ ఛైర్‌కార్‌ టికెట్లపై 25% వరకు డిస్కౌంట్‌.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

Railways to slash fares of AC chair car: ఏసీ ఛైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ ధరలు  తగ్గించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న మార్గాల్లో 25 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

Published : 08 Jul 2023 15:28 IST

దిల్లీ: ఏసీ ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధరలపై రైల్వే శాఖ (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్‌ ధరపై 25 శాతం వరకు డిస్కౌంట్‌ (Discount on AC fares) ఇచ్చేందుకు నిర్ణయించింది. వందేభారత్ (Vande Bharat) సహా అనుభూతి, విస్టాడోమ్‌ కోచ్‌లు కలిగిన రైళ్లకూ ఇది వర్తిస్తుంది. ఆక్యుపెన్సీ ఆధారంగా టికెట్‌ ధరలపై ఈ డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. ఆక్యుపెన్సీ పెంచే లక్ష్యంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్‌ ధరలను నిర్ణయించే అధికారం ఆయా రైల్వే జోన్లలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌కు కట్టబెట్టింది.

దేశవ్యాప్తంగా వందే భారత్‌ రైళ్లు విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని రూట్లలో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ.. మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్‌ ధరలు అధికంగా ఉన్న కారణంగా ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఎండలు తగ్గి వర్షాలు కూడా పడుతుండడంతో ఏసీ బోగీల్లో.. ముఖ్యంగా ఛైర్‌కార్లలో ప్రయాణానికి ఆశించిన మేర ప్రయాణికుల నుంచి డిమాండ్‌ ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు కొత్త పథకంతో ముందుకొచ్చింది. అనుభూతి, విస్టాడోమ్‌ కోచ్‌లు కలిగిన రైళ్లు సహా ఏసీ ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ తరగుతులు కలిగిన అన్ని రైళ్లకూ ఈ స్కీమ్‌ వర్తిస్తుందని  రైల్వే బోర్డు తెలిపింది.

డిస్కౌంట్‌ అనేది బేసిక్‌ ఫేర్‌లో గరిష్ఠంగా 25 శాతం వరకు ఇవ్వనున్నారు. రిజర్వేషన్‌, సూపర్‌ ఫాస్ట్‌ సర్‌ఛార్జి, జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు మాత్రం అదనంగా వర్తిస్తాయి. గడిచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లను పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. డిస్కౌంట్‌ నిర్ణయించే ముందు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆక్యుపెన్సీని బట్టి రైలు ప్రయాణించే మొత్తం దూరానికి, లేదా ఎంపిక చేసిన స్టేషన్ల మధ్య కూడా ప్రయాణానికి డిస్కౌంట్‌ వర్తింపజేయొచ్చని తెలిపింది. డిస్కౌంట్‌ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఇప్పటికే బుక్‌ చేసుకున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. హాలిడే, ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లకు ఈ స్కీమ్‌ వర్తించదని రైల్వే బోర్డు స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని