Sexual abuse: లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్‌ను సస్పెండ్‌ చేస్తాం - జేడీఎస్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.

Published : 29 Apr 2024 20:30 IST

శివమొగ్గ: మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)పై వేటు వేసేందుకు జేడీ(ఎస్‌) సిద్ధమైంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించినట్లు  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో.. కేసు నుంచి భాజపాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూరంగా ఉంచేందుకు కుమారస్వామి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

‘ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవడంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం జరిగే పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో దీన్ని ప్రతిపాదిస్తాం. ఆయన ఎంపీ అయినందున.. నిర్ణయం పైస్థాయిలో తీసుకోవాలి. అందుకే ఈ విషయాన్ని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడకు విన్నవించాను’ జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి పేర్కొన్నారు.

ఆ అసభ్యకర వీడియోలు నాలుగైదేళ్ల నాటివి: దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ

ఈ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు చేస్తోందన్న మాజీ సీఎం.. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడినుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు చేయాలన్నారు. ఆయనపై అభియోగాలు నిజమైతే చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. ఈ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు. అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ చేస్తోన్న విమర్శలను ప్రస్తావించిన ఆయన.. భాజపాకు, ప్రధాని మోదీకి ఈ కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా దేవేగౌడకు, తనకూ ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని