icon icon icon
icon icon icon

Karnataka: ఆ అసభ్యకర వీడియోలు నాలుగైదేళ్ల నాటివి: దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ

ప్రజ్వల్‌ రేవణ్ణపై వచ్చిన ఆరోపణల విషయంలో ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ స్పందించారు. తమపై జరుగుతున్న కుట్రలో అవి భాగమని వ్యాఖ్యానించారు.  

Published : 29 Apr 2024 16:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (జేడీఎస్‌) (Prajwal Revanna) అసభ్యకర వీడియోల విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఆయన తండ్రి, దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ స్పందించారు. అదంతా ఓ కుట్ర అని కొట్టిపారేశారు.  తాము భయపడి పారిపోయే రకం కాదని ఆయన వెల్లడించారు. ‘‘ఎలాంటి కుట్ర జరుగుతోందో నాకు తెలుసు. భయపడి పారిపోయే రకాలం కాదు. వాళ్లు విడుదల చేసిన వీడియోలు 4-5 ఏళ్ల క్రితం నాటివి. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం అధినాయకత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనీయండి. గత 40 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో చాలా దర్యాప్తులను ఎదుర్కొన్నాం. సిట్‌ లేదా సీఐడీకి అప్పగించనీయండి’’ అని రేవణ్ణ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ వ్యవహారం నుంచి మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి దూరం జరిగారు. అది పూర్తిగా రేవణ్ణ కుటుంబానికి సంబంధించిన అంశమన్నారు. దానితో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆ వీడియోలు విడుదల చేసిన టైమింగ్‌ను ఆయన ప్రశ్నించారు. వీటిల్లో ఏమైనా తప్పు ఉంటే నిందితులు కచ్చితంగా శిక్షను అనుభవించాలన్నారు.

 లైంగిక దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఒక మహిళ  ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణలపై హొళెనరసీపుర పోలీసుస్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే హాసన జిల్లాలో వైరల్‌ అవుతున్నాయి. కర్ణాటక మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సిఫార్సుమేరకు ఈ అంశంపై ప్రభుత్వం సీఐడీ డీఐజీ బిజయ్‌కుమార్‌ సింగ్‌ నేతృత్వంలో ఐపీఎస్‌ అధికారులు సుమన్‌ డి పన్సేకర్‌, సీమా లాట్కర్‌లు సభ్యులుగా సిట్‌ను ఏర్పాటుచేసింది. అసభ్యకర వీడియోల కేసు నమోదైన సమయంలోనే ప్రజ్వల్‌ ఆదివారం తెల్లవారుజామున కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ)కు వెళ్లారు. హాసన లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ప్రజ్వల్‌ తాజాగా భాజపా-దళ్‌ అభ్యర్థిగా బరిలో దిగారు. ఎన్నికల ప్రచార సమయంలోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన వీడియోలపై ప్రచారం చేశారు. అవి మార్ఫింగ్‌వని ప్రజ్వల్‌ ఖండించారు.  మరోవైపు ‘భార్య ఇంట్లో లేని సమయంలో రేవణ్ణ తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవారని’ బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. తనపై ఆయన కుమారుడు ప్రజ్వల్‌ కూడా లైంగిక దౌర్జన్యానికి పాల్పడి సెల్‌ఫోన్లలో చిత్రీకరించి బెదిరించేవారని ఫిర్యాదు చేశారు. ఈ అశ్లీల వీడియోలను నిక్షిప్తం చేసిన పెన్‌డ్రైవ్‌లను కొందరు హాసనలోని పార్కులు, హోటళ్లలో వదిలిపెట్టారు. ప్రజ్వల్‌ పలువురు యువతులు, మహిళలతో వేర్వేరు సందర్భాల్లో లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టున్న వీడియోలు ఇందులో ఉన్నాయి. అవి డీప్‌ఫేక్‌తో సృష్టించినవని జనతాదళ్‌ సామాజిక మాధ్యమ విభాగం చెబుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img