Live-in relation: సహజీవనం ‘ప్రమాదకరమైన జబ్బు’.. లోక్‌సభలో భాజపా ఎంపీ

సహజీవనం (Live-in relationship) ఓ ‘ప్రమాదకరమైన జబ్బు’ అని.. దాన్ని సమాజం నుంచి నిర్మూలించాల్సిన అవసరం ఉందని భాజపా ఎంపీ ధరంవీర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Updated : 07 Dec 2023 15:29 IST

దిల్లీ: సహజీవనం (Live-in relationship) అనేది ఓ ‘ప్రమాదకరమైన జబ్బు’ అని భాజపా ఎంపీ పేర్కొన్నారు. దాన్ని సమాజం నుంచి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. హరియాణాకు చెందిన భాజపా ఎంపీ ధరంవీర్‌ సింగ్‌ లోక్‌సభ (Lok Sabha) జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం అధికంగా ఉంటోందని పేర్కొన్నారు.

‘తీవ్రమైన ఈ అంశాన్ని ప్రభుత్వం, పార్లమెంటు (Parliament winter Session) దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా. ‘వసుధైవ కుటుంబకమ్‌’ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన సామాజిక నిర్మాణం కూడా భిన్నమైనది’ అని హరియాణాకు చెందిన భాజపా ఎంపీ ధరంవీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం అధికంగా ఉంటోందన్నారు. వివాహ బంధం విషయంలో వధూవరుల తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

సహజీవనం దురాచారం..

సహజీవనం అనేది ప్రస్తుతం సమాజంలో ఓ ప్రమాదకరమైన జబ్బుగా మారుతోందని భాజపా ఎంపీ ధరంవీర్‌ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇది సాధారణమే అయినప్పటికీ.. మనదేశంలో కూడా ఈ తరహా బంధాలు పెరుగుతున్నాయన్నారు. వీటి పరిణామాలు మాత్రం అత్యంత భయంకరంగా ఉంటున్నాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా శ్రద్ధా వాకర్‌-అఫ్తాబ్‌ పూనావాల కేసును ఆయన ఉదహరించారు. ఈ నేపథ్యంలో సహజీవనానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని.. తద్వారా ఈ ప్రమాదకరమైన వ్యాధిని సమాజం నుంచి నిర్మూలించగలమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

‘ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు’: భారత్‌-అమెరికా రిలేషన్‌షిప్‌పై గార్సెట్టి వ్యాఖ్య

సమాజంలో ఇప్పటికీ పెద్దలు కుదిర్చిన వివాహాలకే అధిక ప్రాధాన్యం ఉందని ధరంవీర్‌ అభిప్రాయపడ్డారు. అమెరికాలో విడాకుల రేటు 40శాతంగా ఉంటే భారత్‌లో అది 1.1శాతంగా ఉందని గుర్తుచేశారు. ఇటీవల మనదేశంలోనూ విడాకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ..ప్రేమ వివాహాల్లోనే అవి అధికంగా ఉంటున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రేమ వివాహాలకు వధూవరుల తల్లిదండ్రుల అంగీకారాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని