సైన్యం గుప్పిట్లో మయన్మార్‌

మయన్మార్‌ సాయుధ బలగాల కవాతులతో దద్దరిల్ల్లుతోంది.

Updated : 15 Feb 2021 16:10 IST

ఇంటర్నెట్‌.. మళ్లీ కట్‌

యాంగూన్: అతిపెద్ద నగరం యాంగూన్‌తో సహా మయన్మార్‌ సాయుధ బలగాల కవాతులతో దద్దరిల్ల్లుతోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన అనంతరం దేశంలో ఇంటర్నెట్‌ సదుపాయం నిలిచిపోయింది. ప్రదర్శనల నిషేధం, ప్రజాహక్కుల రద్దు వంటి సైనిక ప్రభుత్వ ఆదేశాలపై నిరసనలు హోరెత్తాయి. మరో వైపు ప్రజలను, నిరసనకారులను భయభ్రాంతులను చేసేందుకు సైనిక ప్రభుత్వం ఏకంగా 23 వేల మంది ఖైదీలను విడుదల చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాత్రివేళ అలజడులు సృష్టించేందుకు గాను.. సైనిక ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

హక్కులపై నిషేధం, కర్ఫ్యూ అమలు

గతేడాది జరిగిన ఎన్నికల్లో అవకతవకలపై సక్రమ విచారణ జరపలేదన్న సాకుతో.. సైన్యం ప్రభుత్వాన్ని కూలదోసి, నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకితో సహా పలువురు మంత్రులు, రాజకీయ నేతలను అరెస్టు చేసింది. ఇక దేశంలో చెలరేగుతున్న నిరసనలపై ఉక్కు పాదం మోపేందుకు పలు చర్యలు చేపడుతోంది. ఆంగ్‌ సాన్‌ సూకిని సోమవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ఇది ఒక రోజు ఆలస్యం కావచ్చని సమాచారం. ఈ క్రమంలో నేడు తెల్లవారు ఝామున ఒంటి గంట నుంచి, ఉదయం తొమ్మిది గంటల వరకు ఇంటర్నెట్‌ను నిలిపారు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటాన్ని ప్రభుత్వం నిషేధించింది. అంతేకాకుండా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తోంది. 

ప్రభుత్వ, రైల్వే సిబ్బంది కూడా..

పలు పౌర హక్కులను రద్దు చేస్తూ సైనిక నేత సెన్‌ జెన్‌ మిన్‌ యాంగ్‌ లయింగ్‌ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. ఆదివారం నిరసనలు మిన్నంటాయి. నిబంధనలను అతిక్రమించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ దేశ రాజధాని నయాపైటాతో సహా పలు ప్రాంతాల్లో లక్షలాది పౌరులు వీధులకెక్కారు. ఈ నిరసనల్లో ప్రభుత్వోద్యోగులు చురుగ్గా పాల్గోవటం గమనార్హం. వారితో చేయి కలిపిన రైల్వే సిబ్బంది కూడా సమ్మెచేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. విడుదలైన ఖైదీలను ఎదుర్కొనేందుకు మయన్మార్‌ ప్రజలు ఏకమై, తమ తమ ప్రాంతాల్లో సొంత రక్షక దళాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

అంతర్జాతీయ ఖండన

ఇదిలా ఉండగా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మద్దతుగా ప్రదర్శనలు చేస్తున్న వారిపై హింసాత్మక చర్యలను మానుకోవాలని అమెరికా, కెనడాలతో సహా పన్నెండు యూరోపియన్‌ దేశాల రాయబారులు మయన్మార్‌ సైనిక ప్రభుత్వానికి హితవు పలికారు. అంతేకాకుండా ఆ దేశంలో చోటుచేసుకున్న రాజకీయ నేతల అరెస్టులను కూడా వారు ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని