Ajit Doval: ‘ముందు సమస్యలు పరిష్కారం కానివ్వండి’

ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ.. భారత్‌కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జై శంకర్‌తో సమావేశమయ్యారు.

Published : 25 Mar 2022 18:33 IST

చైనా విదేశాంగమంత్రి ఆహ్వానంపై స్పందించిన డోభాల్‌

దిల్లీ: ఎటువంటి ముందస్తు ప్రకటనా లేకుండా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ.. భారత్‌కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు వివాదంపై ఇరు బృందాల మధ్య సానుకూల వాతావరణంలో విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులోని సున్నిత ప్రాంతాల్లో బలగాలను త్వరగా, పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలని ఎన్‌ఎస్‌ఏ ఒత్తిడి తీసుకువచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగే క్రమంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలోనే చైనాలో పర్యటించాల్సిందిగా వాంగ్ యీ ఆహ్వానించగా.. ముందు రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చాల్సి ఉందంటూ డోభాల్‌ స్పందించారు.

సరిహద్దు ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ.. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేందుకు, ఇరు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా డోభాల్‌ తెలియజేశారు. ఇరు దేశాల భద్రతా ప్రయోజనాలను ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం దౌత్య ,సైనిక స్థాయులలో సానుకూల చర్చలు కొనసాగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునేందుకు ఈ చర్యలు చాలా అవసరమని చెప్పారు. ఉద్రిక్తలను పరిష్కరించే విషయంలో చిత్తశుద్ధితో ముందుకెళ్లాల్సి ఉందన్నారు.  ఈ క్రమంలోనే చైనా సందర్శించాల్సిందిగా వాంగ్‌యీ ఆహ్వానం పలికారు. అందుకు డోభాల్‌  సానుకూలంగా స్పందించారని సదరు వర్గాలు తెలిపాయి. అయితే తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలను విజయవంతంగా కొలిక్కి తీసుకువచ్చిన తర్వాత చైనాను సందర్శించవచ్చని  ఆయన సమాధానమిచ్చినట్లు వెల్లడించాయి.

ఢోబాల్‌, వాంగ్ ఇరు దేశాల మధ్య సరిహద్దు చర్చల కోసం ప్రత్యేక ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించడంపై వారు జులై 2020లో సుదీర్ఘంగా ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా.. దాదాపు రెండేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లో తలెత్తిన ప్రతిష్టంభన కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి పర్యటన వాంగ్‌దే. అయితే ఆయన పర్యటన గురించి అటు చైనా గానీ, ఇటు భారత్‌ గానీ ముందుగా ప్రకటించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని