CA Exams: సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్‌’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

సీఏ పరీక్షల షెడ్యూల్‌ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్‌ను విచారించేందుకు నిరాకరించింది.

Published : 29 Apr 2024 14:51 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన చార్టర్డ్‌ అకౌంటెన్సీ (CA)కి సంబంధించిన కొన్ని పేపర్ల పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పోలింగ్‌ రోజున ఏ పరీక్షను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) నిర్వహించడం లేదని పేర్కొంది. తేదీలను మార్చడం వల్ల పరీక్ష నిర్వహణకు ఇప్పటికే చేస్తున్న విస్తృత ఏర్పాట్లకు విఘాతం కలుగుతుందని, ఫలితంగా ఎంతోమంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. పరీక్షల షెడ్యూల్‌ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొంటూ పిల్‌ను విచారించేందుకు సుప్రీం ధర్మాసనం (Supreme Court) నిరాకరించింది.

సీఏ పరీక్షలు మే 2 నుంచి మే 17వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 591 కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. దాదాపు 4లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షల కోసం నమోదు చేసుకున్నారు. అయితే, మే 7, మే13న పలు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనున్నందున మే 8, 14న జరగనున్న పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పిల్ దాఖలైంది. దీనిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. పోలింగ్‌ తేదీల్లో పరీక్షలు లేనందున ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

నా ముఖం కాదు.. మార్కులు చూడండి

ఇదిలాఉంటే.. ఇదే అంశానికి సంబంధించి దిల్లీ హైకోర్టులో ఏప్రిల్‌ 8న ఓ పిటిషన్ దాఖలు కాగా.. పిటిషనర్‌ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దాదాపు 4.26 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షల కోసం నమోదు చేసుకున్నారని, కేవలం కొద్ది మంది అభ్యర్థన కోసం వీటిని మార్చలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రకటించిన పరీక్షల తేదీలకు సార్వత్రిక ఎన్నికల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా కూడా న్యాయస్థానానికి తెలియజేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని