Supreme Court: తర్వాత రాజధాని రైలునూ షెడ్యూల్‌ చేయమంటారా? వందే భారత్‌ పిటిషన్‌పై సుప్రీం అసహనం

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రైలు సర్వీసుపై దాఖలపై ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. రైలు ఏ స్టేషన్‌లో ఆగాలనేది మేం నిర్ణయించాలా? అన్ని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

Published : 17 Jul 2023 16:49 IST

దిల్లీ: కేరళలోని తిరూర్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat train) రైలు స్టాప్‌ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కొట్టివేసింది. ఇలాంటి అభ్యర్థనతో అత్యున్నత న్యాయస్థానానికి రావడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇవన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలని పిటిషనర్‌కు కాస్త గట్టిగానే చెప్పింది.

కేరళ (Kerala)లోని మలప్పురం జిల్లాలో గల తిరూర్ రైల్వే స్టేషన్‌ (Tirur railway station)లో వందే భారత్‌ రైలుకు హాల్ట్‌ ఇచ్చేలా దక్షిణ రైల్వేకు ఆదేశాలివ్వాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన న్యాయవాది పీటీ శీజిష్‌ తొలుత కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తొలుత తిరూర్‌లో వందే భారత్‌ను ఆపాలని నిర్ణయించినప్పటికీ.. ఆ తర్వాత రాజకీయ కారణాలతో రైల్వే శాఖ ఆ నిర్ణయాన్ని మార్చుకుందని ఆరోపించారు. అయితే, ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్లారు. ఈ పిటిషన్‌ను సోమవారం పరిశీలించిన సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

‘‘వందేభారత్‌ రైలు ఏ స్టేషన్‌లో ఆగాలనేది నిర్ణయించాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు. ఆ తర్వాత దిల్లీ-ముంబయి రాజధాని (Rajdhani Train) స్టాప్‌ ఎక్కడుండాలో కూడా మమ్మల్ని షెడ్యూల్‌ చేయమంటారా? ఇలాంటివి మేం ప్రభుత్వానికి చెప్పలేం. ఇది విధానపరమైన అంశం. అధికారుల దగ్గరకు వెళ్లండి’’ అని పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘‘రైళ్లు ఎక్కడెక్కడ ఆగాలనేది రైల్వే శాఖ నిర్ణయిస్తుంది. ఫలానా రైలు ఫలానా స్టేషన్‌ దగ్గర ఆగాలని డిమాండ్‌ చేసే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా వందే భారత్‌ (Vande Bharat train) లాంటి హైస్పీడ్‌ రైళ్ల స్టాప్‌లను ఇలాంటి డిమాండ్ల ప్రాతిపదికన నిర్ణయించడం సరికాదు. ప్రతి జిల్లాలో నుంచి ఓ వ్యక్తి తమకు నచ్చిన రైల్వే స్టేషన్‌లో స్టాప్‌ ఉండాలని డిమాండ్‌ చేయడం ప్రారంభిస్తే.. హైస్పీడ్‌ రైళ్ల ఏర్పాటుకు ప్రయోజనం లేకుండా పోతుంది. ఎక్స్‌ప్రెస్‌ రైలు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది’’ అని కోర్టు తెలిపింది. కనీసం తన పిటిషన్‌ను పరిశీలించేలా ప్రభుత్వానికి సూచించాలని పిటిషనర్‌ అభ్యర్థించగా.. ధర్మాసనం అందుకు తిరస్కరించింది. తాము ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని