Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగి బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్‌లోని కుర్వాయ్‌ కేథోరా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.

Updated : 17 Jul 2023 09:30 IST

భోపాల్‌: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్  (Madhya Prdaesh) రాజధాని భోపాల్‌ నుంచి దిల్లీ వెళ్తున్న ఈ రైల్లో  (Bhopal-Delhi Train) మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు అప్రమత్తమవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

రాణి కమలాపతి - హజ్రత్‌ నిజాముద్దీన్‌ వందే భారత్‌ రైలు  సోమవారం తెల్లవారుజామున 5.40 గంటల ప్రాంతంలో భోపాల్‌ నుంచి బయల్దేరింది. ఉదయం 6.45 గంటల ప్రాంతంలో సీ-12 బోగీ చక్రాల్లో నుంచి పొగలు రావడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే రైలును విదిశ జిల్లాలోని కుర్వాయ్‌ - కేథోరా స్టేషన్ల మధ్య నిలిపివేసి తనిఖీ చేయగా.. బ్యాటరీ బాక్సుల్లో మంటలు (Fire in Battery Box) చెలరేగినట్లు తెలిసింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ప్రయాణికులను దించేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

వరద నీటిలోనే ఎర్రకోట, మహాత్ముని సమాధి

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. మంటలు బ్యాటరీ బాక్స్‌కు మాత్రమే పరిమితమయ్యాయని.. వాటిని పూర్తిగా అదుపు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది రైలుకు మరమ్మతులు చేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతిక తనిఖీలు పూర్తి చేసిన అనంతరం రైలు దిల్లీ బయల్దేరుతుందని చెప్పారు. ఘటన సమయంలో సీ-12 బోగీలో 36 మంది ప్రయాణికులున్నారు.

మధ్యప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చిన మొదటి వందే భారత్‌ రైలు (Vande Bharat Express) ఇదే. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని