Supreme Court: ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్‌కు ఊరట

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) కేసులో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. 

Published : 29 Apr 2024 18:08 IST

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.

ఇటీవల ఈ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టంచేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దీదీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తీర్పును సవాల్‌ చేసింది. కోర్టు ఏకపక్షంగా ఆ నియామకాలను రద్దు చేసిందని తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. ‘‘రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులపై సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తున్నాం’’ అని తెలిపింది.

వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?

ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని