Sandeshkhali: వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?

సందేశ్‌ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని మందలించింది.

Updated : 29 Apr 2024 16:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని ప్రశ్నించింది. సందేశ్‌ఖాలీ అంశంలో సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బీఆర్‌ గవయ్‌, జస్టిస్‌ సందీప్‌మెహతా నేతృత్వంలోని బెంచ్‌ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. 

దీనిపై పశ్చిమబెంగాల్‌ తరపున హాజరైన న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో స్పందించాం. నాడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయకుండానే సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని పేర్కొంది’’ అని తెలిపారు.

దీనిపై సుప్రీం స్పందిస్తూ.. హైకోర్టు వ్యాఖ్యలతో బాధపడితే రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని కోరవచ్చని న్యాయస్థానం సూచించింది. అనంతరం వేసవి సెలవుల తర్వాత వాదనలు వింటామని పేర్కొంది. 

ప్రస్తుతం సందేశ్‌ఖాలీలో ఈడీపై దాడి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అదే సమయంలో అక్రమంగా వ్యవసాయ భూములను ఆక్రమించుకొని చేపల చెరువులుగా మారుస్తుండటం, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలపై కూడా విచారణ చేస్తోంది.

రేషన్‌ బియ్యం కుంభకోణం’ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్‌ షేక్‌ ఇంట్లో తనిఖీల కోసం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై ఆయన అనుచరులు జనవరి 5న దాడి చేసిన విషయం తెలిసిందే. నాటినుంచి షాజహాన్‌ కనిపించకుండా పోయారు. ఆయన్ని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సందేశ్‌ఖాలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో షాజహాన్‌పై అత్యాచార ఆరోపణలు చేస్తూ స్థానిక మహిళలు చేసిన ఆందోళన దుమారం రేపింది. తీవ్ర వివాదాస్పదంగా మారిన ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించడంతో చివరకు ఫిబ్రవరి 29న షాజహాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని