Manish Sisodia: నా తలనైనా నరుక్కుంటా.. వారి ముందు తలవంచను : మనీశ్ సిసోదియా

నూతన మద్యం విధానంలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటోన్న దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఓ కీలక విషయం వెల్లడించారు.

Updated : 22 Aug 2022 16:29 IST

భాజపా నాకో సందేశం పంపింది..! వారు నన్నేం కోరారో తెలుసా..?

దిల్లీ: నూతన మద్యం విధానంలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటోన్న దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఓ కీలక విషయం వెల్లడించారు. భాజపా నుంచి తనకు ఓ సందేశం వచ్చిందని తెలిపారు. తనపై ఉన్న కేసుల్ని మూసివేసేందుకు ఆప్‌ను వదిలి.. భాజపాలో చేరాలని కోరుతూ ఆ సందేశం పంపారన్నారు.

‘నాకు భాజపా నుంచి ఒక సందేశం వచ్చింది. సీబీఐ, ఈడీ నమోదుచేసిన కేసుల్ని మూసివేసేందుకు.. ఆప్‌ను వీడి, భాజపాలో చేరాలని అందులో కోరారు. కానీ నేనొక రాజ్‌పుత్‌ను. మహా రాణాప్రతాప్‌ వారసుడిని. నేను నా తలనైనా నరుక్కుంటాను కానీ, అవినీతి కుట్రదారుల ముందు మాత్రం తలవంచను. నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. నాకొచ్చిన సందేశానికి ఇదే నా సమాధానం’ అంటూ మనీశ్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సిఫార్సు చేశారు. దాంతో మనీశ్, పలువురు మాజీ అధికారుల ఇళ్లు, ప్రాంగణాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 

అలాగే దర్యాప్తు సంస్థ తనపై లుకౌట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) జారీ చేసిందని సిసోదియా చెప్పారు. తాను దేశం విడిచి వెళ్లకుండా చూడడానికి ఈ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. అయితే మద్యం కుంభకోణంలో ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న ఎనిమిది మందిపై ఎల్‌వోసీ జారీ చేసినట్లు సీబీఐ తెలిపింది. సిసోదియా సహా నలుగురు ప్రజా ప్రతినిధులపై మాత్రం ఇవి జారీ కాలేదని స్పష్టంచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని