Pfizer Covid Pill: ఫైజర్‌ నిర్ణయంతో 95 దేశాలకు ఊరట..!

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఫైజర్‌ రూపొందించిన యాంటీవైరల్‌ ఔషధంపై ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఔషధాన్ని ఇతర తయారీ సంస్థలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.

Published : 16 Nov 2021 19:54 IST

కొవిడ్‌ ఔషధ తయారీకి ఇతర కంపెనీలకు అనుమతి

లండన్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఫైజర్‌ రూపొందించిన యాంటీవైరల్‌ ఔషధంపై ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఔషధాన్ని ఇతర తయారీ సంస్థలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితికి చెందిన ఔషధ విభాగంతో జరిగిన ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపింది. ఈ విభాగానికి లైసెన్సు మంజూరీ చేయడంతో చాలా దేశాల్లో ఈ ఔషధం అందుబాటులోకి వస్తుందని.. దాదాపు 95 దేశాలకు ఊరట కలుగనుందని ఫైజర్‌ అభిప్రాయపడింది.

తాము తయారు చేసిన కొవిడ్‌ యాంటీవైరల్‌ ఔషధాన్ని తయారు చేసేందుకు ఐక్యరాజ్యసమితికి చెందిన మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (MPP)తో ఒప్పందం చేసుకున్నట్లు ఫైజర్‌ వెల్లడించింది. దీంతో దాదాపు 95దేశాల్లోని జనరిక్‌ డ్రగ్స్‌ సంస్థలు ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపింది. కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోంటున్న తమ ఔషధాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నట్లు మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ ప్రతినిధి ఎస్టెబాన్‌ బర్రోన్‌ పేర్కొన్నారు. వచ్చే మరికొన్ని నెలల్లోనే ఇతర సంస్థలు ఈ ఔషధాన్ని తయారీని ప్రారంభనున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. అయితే, ఇతర సంస్థలు తమ ఔషధాన్ని తయారు చేసినప్పటికీ వాటినుంచి తాము ఎటువంటి రాయల్టీని తీసుకోబోమని ఫైజర్‌ కూడా స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, కొవిడ్‌ కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి చేరికతో పాటు మరణాల ముప్పును తగ్గించడంలో తాము రూపొందించిన యాంటీవైరల్‌ ఔషధం 89శాతం సమర్థత చూపించిందని ఫైజర్‌ వెల్లడించింది. కొవిడ్‌ బాధితుల ప్రాణాలను రక్షించే సామర్థ్యమున్న ఈ ఔషధ ప్రయోగాల సమాచారాన్ని త్వరలోనే నియంత్రణ సంస్థలకు అందిస్తామని ఈమధ్యే ప్రకటించింది. కొవిడ్‌ చికిత్సలో భాగంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న రైటోనవిర్‌ (Ritonavir)తో కలిపి కాంబినేషన్‌ రూపంలో ఈ ఔషధాన్ని తీసుకోవాలని సూచించింది. పాక్స్‌లోవిడ్‌ (Paxlovid) బ్రాండ్‌ పేరుతో ఈ యాంటీవైరల్‌ ఔషధాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఫైజర్‌ వెల్లడించింది. మూడు మాత్రల్లో లభించే ఈ యాంటీవైరల్‌ ఔషధం రోజుకు రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని