Prachi Nigam: నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్‌ దీటైన జవాబు

సోషల్‌ మీడియా ట్రోలర్ల వికృత రూపం మరోసారి బయటపడింది. పదో తరగతిలో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన బాలికను వారు వేధించారు. ఒక దశలో కొన్ని మార్కులు తగ్గినా బాగుండు అని ఆమె అనుకొనేలా చేశారు. చివరికి నెటిజన్లు, నాయకులు ఆమెకు అండగా నిలవడంతో ధైర్యం తెచ్చుకొని భవిష్యత్తుపై దృష్టిపెడతానని పేర్కొంది.  

Updated : 28 Apr 2024 10:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అందంగా ఉండకపోవడం ఏమైనా నేరమా..? సోషల్‌ మీడియా ట్రోలర్లకు ఈ మాత్రం ఇంగితజ్ఞానం కూడా లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన ఓ సరస్వతి పుత్రికను లక్ష్యంగా చేసుకొని వేధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె తప్పు ఏంటయ్యా అంటే.. ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటం..! ఆ చిన్నారి మాత్రం చాలా హుందాగా స్పందించింది. ఆమె పరిపక్వతను చూసిన నెటిజన్లు ఇప్పుడు అండగా నిలిచారు.   

ఇటీవల ఉత్తరప్రదేశ్‌ 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. దీనిలో 98.5శాతం మార్కులతో ప్రాచీ నిగమ్‌ (Prachi Nigam) అనే బాలిక టాపర్‌గా నిలిచింది. దీంతో ఆమె చిత్రాలు మీడియాలో వచ్చాయి. హార్మోన్లలో మార్పుల కారణంగా ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటంతో ఆమెను సోషల్‌మీడియాలో ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. చిన్న పిల్ల కావడంతో తొలుత బాధపడింది. ‘కొన్ని మార్కులు తగ్గినా బాగుండేది.. తాను సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేదాన్ని కాదు. అప్పుడు ఈ వేధింపులు తప్పేవి’ అని ఆ సరస్వతి పుత్రిక ఓ మీడియా సంస్థ వద్ద వాపోయింది. కానీ, ఆమె పరిస్థితిని తెలుసుకొన్న చాలా మంది నెటిజన్లు స్పందించి అండగా నిలిచారు. ఇది ఆమెలో ధైర్యాన్ని పెంచింది. ‘‘యూపీ టాపర్‌గా నా చిత్రం సోషల్‌ మీడియాలో షేర్‌ అయింది. కొంత మంది నన్ను ట్రోల్‌ చేశారు. అదే సమయంలో చాలా మంది మద్దతుగా కూడా నిలిచారు. వారికి కృతజ్ఞతలు. ఇక్కడ నాకొచ్చిన మార్కులు ముఖ్యం.. అంతేకానీ నా ముఖం కాదు. అందంగా ఉండడని చాణక్యుడిని కూడా వేధించారు. కానీ, అవేవీ అతడిపై ప్రభావం చూపలేదు’’ అని వ్యాఖ్యానించింది.

ఓ పక్క ప్రాచీ ఈ ఆన్‌లైన్‌ వేధింపులకు మదనపడుతుండగానే ఓ షేవింగ్‌ కంపెనీ దీనిని సొమ్ము చేసుకోవాలని యత్నించింది. ఆ చిన్నారికి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ఫొటోను వాడుకొని వాణిజ్య ప్రకటన ఇచ్చింది. ఈ చర్యపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ కంపెనీ సీఈవో వివరణ ఇచ్చుకొన్నారు. తాము వాణిజ్య లక్ష్యాలతో ఆ ప్రకటన ఇవ్వలేదని.. ఆ బాలికను ప్రోత్సహించాలనేదే తమ ఉద్దేశమని ప్రకటించడం గమనార్హం.  

ఈ పరిస్థితిపై ప్రాచీ తల్లి మమత మాట్లాడుతూ ఆన్‌లైన్‌ వేధింపులు వచ్చిన సమయంలో తన కుమార్తెకు ధైర్యం చెప్పానన్నారు. వాటిని పట్టించుకోకుండా లక్ష్యంపై దృష్టిపెట్టాలని సూచించినట్ల పేర్కొన్నారు. తాము ప్రాచీ పరిస్థితిపై వైద్య నిపుణులను సంప్రదించాలనుకొంటున్న సమయంలోనే పరీక్షల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించారు. ఇప్పుడు ఆమె చికిత్స బాధ్యతను ప్రభుత్వం స్వీకరించిందని చెప్పారు. 

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. ఆమె నేరుగా ప్రాచీతో మాట్లాడి అభినందించారు. చదువుపై దృష్టిపెట్టి అనుకొన్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా కూడా బాలికతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ను పట్టించుకోవద్దని ధైర్యం చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని