Brij Bhushan: నాపై ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరేసుకొంటాను..: బ్రిజ్‌ భూషణ్‌ సవాలు

భాజపా ఎంపీ, రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ తాను నిర్దోషినని చెబుతున్న వీడియో విడుదలైంది. తనపై వచ్చిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా ఉరేసుకొంటానని సవాల్‌ చేశారు. 

Published : 07 May 2023 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తనపై క్రీడాకారులు చేస్తున్న వాటిలో ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరేసుకొంటానని రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సవాలు చేశారు. దేశానికి చెందిన టాప్‌ రెజ్లర్లు భజరంగ్‌ పునియా, వినేష్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ తదితరులు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌ వద్ద కొన్నాళ్లుగా ధర్నాలు చేస్తున్నారు. దీనిపై భూషణ్‌ స్పందిస్తూ  ‘‘ ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరేసుకొంటాను. ఈ విషయం ఇప్పుడు దిల్లీ పోలీసుల వద్ద ఉంది. అందుకే ఈ అంశం గురించి ఎక్కువ మాట్లాడను. వీరి వద్ద వీడియో ఆధారం ఏమైనా ఉందా అని నేను తొలి రోజు నుంచి అడుగుతున్నాను. ‘బ్రిజ్‌ భూషణ్‌ రావణుడి వంటివాడా’ అని మీరు రెజ్లింగ్‌కు సంబంధించిన వారిని ఎవరినైనా అడగండి.. రెజ్లింగ్‌కు, దేశానికి నా జీవితంలో 11 ఏళ్లు వెచ్చించాను’’ అని వ్యాఖ్యానిస్తున్న వీడియో ఒకటి విడుదల చేశారు.

సుప్రీంకోర్టు జోక్యంతో ఫిబ్రవరి 28వ తేదీన బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇది తమ తొలి విజయం అని రెజ్లర్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వీటిపై గతంలో బ్రిజ్‌ భూషణ్‌ మాట్లాడుతూ తాను అమాయకుడినని పేర్కొన్నారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముందన్నారు. ‘‘మీకు జంతర్‌ మంతర్‌లో న్యాయం అందదు. మీకు న్యాయం కావాలంటే పోలీస్‌ స్టేషన్లకు వెళ్లండి, కోర్టులను ఆశ్రయించండి. కానీ, వారు ఈ విషయాన్ని ఇప్పటి వరకు చేయలేదు. దూషణలు కొనసాగిస్తున్నారు. న్యాయస్థానం ఏమి నిర్ణయించినా మేము అంగీకరిస్తాం’’ అని బ్రిజ్‌ భూషణ్‌ పేర్కొన్నారు.

ఇప్పటికే రెజర్ల అందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చా మద్దతు ప్రకటించింది. వారికి మద్దతుగా జాతీయ స్థాయిలో ఆందోళనలు చేపడతామని ప్రకటించింది. దీంతో నేడు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని