Godavari: 18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్‌కు ముందు అనుకున్న హీరోలెవరంటే?

సుమంత్‌ హీరోగా నటించిన ‘గోదావరి’కి 18 ఏళ్లు. ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 19 May 2024 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథలను తెరకెక్కించడమే కాదు వాటిని ప్రేక్షకులకు చేరువ చేయడంలోనూ దర్శకుడు శేఖర్‌ కమ్ములది (Sekhar Kammula) ప్రత్యేక శైలి. ‘మంచి కాఫీలాంటి సినిమా’ అంటూ ‘ఆనంద్‌’ని ఎలా ప్రమోట్‌ చేశారో అదే తరహాలో ‘ఈ వేసవి.. చాలా చల్లగా ఉంటుంది’ అంటూ ‘గోదావరి’ (Godavari) ని విడుదల చేశారు. ఆయన చేసిన ఈ ప్రయత్నానికి 18 ఏళ్లు. 2006 మే 19న  విడుదలైందీ చిత్రం. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు చూద్దాం (18 years of godavari movie)..

తన రెండో సినిమా ‘ఆనంద్‌’ చిత్రీకరణ సమయంలోనే గోదావరి ఇతివృత్తంగా ఓ సినిమా చేస్తే బాగుంటుదనుకున్నారు శేఖర్‌. తన మనసులో మాటని హీరోయిన్‌ కమలినీ ముఖర్జీ (Kamalinee Mukherjee)కి చెప్పారు. కొన్ని సీన్లు, పాత్రల తీరు గురించి చెప్పగా ఆమె ఫిదా అయ్యారు. ఆ చిత్రంలోనూ నేనే హీరోయిన్‌గా నటిస్తా అని అడగ్గా.. ఆనంద్‌ రిలీజ్‌ తర్వాత చూద్దామన్నారాయన. ఆనంద్ విడుదలై, హిట్ అందుకుంది. ఆ విజయోత్సాహంతో తాను అనుకున్న గోదావరి స్క్రిప్టు సిద్ధం చేశారు. పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు, గోపీచంద్‌.. వీరిలో ఎవరో ఒకరితో సినిమాని తెరకెక్కించాలనుకున్నారట. ఆ సమయానికి అందరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఆ అవకాశం సుమంత్‌ (Sumanth)కి దక్కింది. హీరోయిన్‌ కోసం అన్వేషిస్తుంటే.. శేఖర్‌తో పరిచయం ఉన్నవారంతా ‘మీ ఆనంద్‌ హీరోయిన్‌ పర్‌ఫెక్ట్‌’ అని సూచించారు. దీంతో, ఆమెనే ఎంపిక చేశారు.

ప్రచారానికి తగ్గట్టే ఈ మూవీ వేసవిలో చల్లదనాన్ని తీసుకొచ్చింది. రామ్‌, సీత పాత్రల్లో సుమంత్‌, కమలినీ విశేషంగా ఆకట్టుకున్నారు. ఇందులోని కోటిగాడు(కుక్క)కు శేఖర్‌ కమ్ముల వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. కె.ఎం.రాధాకృష్ణన్‌ అందించిన సంగీతం ఎంతగానో అలరించింది. ‘అందంగా లేనా’ పాటను ఆలపించిన సునీత నంది అవార్డు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని