Vijay Deverakonda: ‘ఐరనే వంచాలా ఏంటి’ ఈ మీమ్స్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరు!

Airanevanchalaenti: విజయ్‌ దేవరకొండ, పరుశురామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫ్యామిలీస్టార్‌’ మూవీలో డైలాగ్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

Updated : 27 Oct 2023 10:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో ఏది ఎప్పుడు ట్రెండ్‌ అవుతుందో ఎవరికీ తెలియదు. ‘ఎవరైనా ట్రోలింగ్‌ చేస్తే.. దాన్ని కూడా చూపించి లబ్ధిపొందేవాడు విజయ్‌’ అంటూ విజయ్‌ దేవరకొండ గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఓ సందర్భంలో సరదాగా చెప్పారు. ప్రస్తుతం ‘ఐరనే వంచాలా ఏంటి?’ (#Airanevanchalaenti) అనే డైలాగ్‌ ఆ స్థాయిలో సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఒకరికి మించి మరొకరు మీమర్స్‌ తమదైన శైలిలో మీమ్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ ‘బాహుబలి’, అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ ఇలా ఒకటేంటి? ఎక్స్‌(ట్విటర్స్‌)లో మీమ్స్‌ వరద పారుతోంది.

‘గీత గోవిందం’ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్‌ పరశురామ్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌లో ‘ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?’ అని విజయ్‌ విలన్‌కు వార్నింగ్‌ ఇస్తాడు. ఐరన్‌ రాడ్‌ను వంచుతాడు. ప్రభాస్‌ ‘మిర్చి’ సినిమాలోని ఓ సన్నివేశానికి ‘ఐరనే వంచాలా ఏంటి’ డైలాగ్‌ను జోడించిన విజయ్‌ దేవరకొండ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్‌ చేశాడు. ‘ఇంటర్నెట్‌.. అసలు ఏం నడుస్తోంది’ అని ఫన్నీగా కామెంట్‌ పెట్టాడు. తర్వాత ఆ వీడియో ‘ఎక్స్‌’కు చేరింది. దీన్ని చూసిన కొందరు అభిమానులు తమ క్రియేటివిటీతో కొన్ని హిట్‌ సీన్లకు ఈ ఐరన్‌ డైలాగ్‌ను జతచేసి పోస్ట్‌ చేయడంతో #Airanevanchalaentiతోపాటు #FamilyStar హ్యాష్‌ట్యాగ్స్‌ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఏకంగా పోస్టర్‌నే రిలీజ్‌ చేసింది.

దీని వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఐరన్‌ డైలాగ్‌, విజువల్స్‌ యాడ్‌ను తలపించేలా ఉన్నాయంటూ ట్రోల్స్‌రాగా వాటిని తిప్పికొట్టేందుకు టీమ్‌ ఇలా ప్లాన్‌ చేసిందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తోంది.





















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని