Bhakta Kannappa: వారంలో ఆరు రోజులే షూటింగ్‌.. అడవిలో 70 రోజులు

Bhakta Kannappa: బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు నటించిన ‘భక్తకన్నప్ప’గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 01 Jul 2023 14:43 IST

అలనాటి నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం ‘భక్తకన్నప్ప’ (Bhakta Kannappa). తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆ చిత్రం ఒక కల్ట్‌ మూవీ. రౌద్ర పాత్రల్లో అద్భుతంగా నటించే ఆయన నుంచి ఒక భక్తిరస చిత్రం వస్తుందంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, ఆ సినిమా విడుదలైన తర్వాత కృష్ణంరాజు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పట్లో కృష్ణంరాజు ఆంగ్ల చిత్రాలు ఎక్కువగా చూసేవారు. ముఖ్యంగా బెన్‌హార్‌, టెన్ కమాండమెంట్స్ వంటి సినిమాలను చాలా సార్లు చూశారు. ఆ స్థాయిలో ఓ పౌరాణిక చిత్రం తెలుగులో తీయాలనుకున్నారు. అప్పటికే గోపీకృష్ణ మూవీస్ సంస్థను నెలకొల్పి ‘కృష్ణవేణి’ చిత్రాన్ని నిర్మించారు. మధుసూదనరావు దర్శకత్వంలో వాణిశ్రీ కథానాయికగా రూపొందిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో రెండో సినిమా కూడా మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించాలని అనుకున్నారు. అదే ‘భక్తకన్నప్ప’. అందుకోసం స్క్రిప్ట్ వర్క్‌ను కూడా పూర్తి చేశారు. కొన్ని పాటలను రికార్డు చేశారు. కానీ, మధుసూదనరావు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరో దర్శకుడిని వెతకడం మొదలు పెట్టారు.

అదే సమయంలో ‘ముత్యాల ముగ్గు’ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో కృష్ణంరాజు దర్శకుడు బాపు దగ్గరకు వెళ్లి ‘భక్తకన్నప్ప’ గురించి చెప్పారు. అంతకుముందు తయారు చేసిన స్క్రిప్ట్‌ను ఆయనకు ఇచ్చారు. బాపు ఆ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు అవసరమని సూచించి, ఆ బాధ్యతను రచయిత ముళ్లపూడి వెంకటరమణకు అప్పగించారు. అప్పటికే అనుకున్న కొన్ని సన్నివేశాలకు అదనంగా ఆసక్తికరమైన, ఎమోషనల్ సీన్లతో కొత్త స్క్రిప్ట్ రెడీ చేశారు రమణ. తమ సంస్థ తీసే తొలి పౌరాణిక చిత్రం కావడంతో పూర్తి అవుట్‌డోర్‌లో భారీ ఎత్తున నిర్మించాలని కృష్ణంరాజు అనుకున్నారు.

70 రోజులు అటవీ ప్రాంతంలోనే

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో షూటింగ్‌ చేయాలని సంకల్పించారు. దీంతో ఐదెకరాల స్థలం ఎంచుకుని చదును చేయించి పెద్ద సెట్‌ వేశారు. అందులోనే కీలక సన్నివేశాలను తీశారు. సినిమాలోని కైలాసం ఎపిసోడ్ తప్ప మిగిలిన సన్నివేశాలను, పాటలను పట్టిసీమ, బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఐదు వందలకు పైగా ఉన్న యూనిట్ సభ్యులతో 70 రోజుల పాటు ఏకదాటిగా అక్కడ షూటింగ్ జరిగింది. వారంలో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ చేసి, ఆదివారం అందరికీ సెలవు ఇచ్చేవారు. ఆ రోజంతా విందులు, వినోదాలతో యూనిట్ సభ్యులు సంతోషంగా గడిపి, మర్నాడు మరింత ఉత్సాహంగా షూటింగ్‌కు హాజరయ్యేవారు. చిత్రీకరణ జరిగినన్ని రోజులు పెళ్లి భోజనాన్ని తలపించేలా రకరకాల వంటకాలతో యూనిట్‌ సభ్యులకు చక్కటి విందును అందించేవారు. ఆ సౌకర్యాలు, వంటలు రుచి చూసిన యూనిట్‌ సభ్యులెవరికీ 70 రోజుల పాటు ఇల్లే గుర్తుకు రాలేదంటే అతిశయోక్తి కాదు.

అదొక రికార్డు

అప్పట్లో భారీ బడ్జెట్‌ చిత్రాలంటే ఎన్టీఆర్‌వే. ఎందుకంటే ఆయనతో సినిమా తీయడానికి రూ.14 నుంచి రూ.16లక్షలు ఖర్చు అయ్యేది. కానీ, భక్తకన్నప్ప కోసం కృష్ణంరాజు ఏకంగా రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ‘రాజుగారు ఇబ్బంది పడతారేమో. ఆలోచించుకోండి’ అని స్నేహితులు సలహా ఇచ్చినా కృష్ణంరాజు వెనక్కి తగ్గలేదు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాల ముగ్గు’ చిత్రంలో కాంట్రాక్టర్ పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్న రావు గోపాలరావు ఈ సినిమాలో గౌరీనాథ శాస్త్రిగా నటించారు. ఆదినారాయణరావు, సత్యం సంయుక్తంగా సంగీత దర్శకత్వం వహించిన ‘భక్త కన్నప్ప’ చిత్రంలోని పాటలన్నీ హిట్టే. ఎరీనా సెట్లో తీసిన డ్రమ్స్ సాంగ్ ‘కండ గెలిచింది’ పాట సినిమాకే హైలైట్‌. అలాగే ‘శివశివ శంకర భక్తవ శంకర’ పాట ఎవర్‌గ్రీన్‌. 1976లో విడుదలైన ‘భక్త కన్నప్ప’ ఘన విజయం సాధించి, నటుడిగా, నిర్మాతగా కృష్ణంరాజుకు మంచి గుర్తింపు తెచ్చింది. నేటి టెక్నాలజీకి అనుగుణంగా ‘భక్తకన్నప్ప’ పేరుతో మంచు విష్ణు కూడా ఓ సినిమా తీస్తానని చెప్పారు. కానీ, ఎందుకో వర్కవుట్‌ కాలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని