Priyadarsi: థ్రిల్‌ ప్రాప్తిరస్తు

ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

Updated : 29 Apr 2024 09:38 IST

ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. జాన్వీ నారంగ్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ‘థ్రిల్‌-యు ప్రాప్తిరస్తు’’ అనే ఉపశీర్షికతో సినిమా ఎలా ఉండనుందన్నది తెలియజేసేలా ఓ ప్రచార చిత్రాన్ని పంచుకున్నారు. ‘‘సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన రొమాంటిక్‌ స్టోరీతో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ప్రియదర్శి చాలా హిలేరియస్‌ పాత్రలో కనిపించనున్నారు. స్క్రిప్ట్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరిలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. త్వరలో టైటిల్‌ ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి.


ప్రేమ.. యాక్షన్‌.. సందేశం

సంజయ్‌రావ్‌, ఆయేషాఖాన్‌ జంటగా మణీంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. లివింగ్‌స్టన్‌ నిర్మాత. గౌర హరి సంగీతమందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో సాయిదుర్గా తేజ్‌ ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. హీరో మాట్లాడుతూ.. ఇది తన జీవితాన్ని మలుపుతిప్పే చిత్రం  అవుతుంది అన్నారు. ‘‘టికెట్‌ కొనుక్కొని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు డబ్బుకు మించిన ఆనందాన్నిస్తుంది’’ అన్నారు మణీంద్రన్‌. ప్రేమ, యాక్షన్‌తో పాటు మంచి సందేశమున్న చిత్రమిదన్నారు నిర్మాత. కార్యక్రమంలో బ్రహ్మాజీ, గౌర హరి తదితరులు పాల్గొన్నారు.


రాజు యాదవ్‌ రాగాలాపన

గెటప్‌ శ్రీను హీరోగా కె.కృష్ణమాచారి తెరకెక్కించిన చిత్రం ‘రాజు యాదవ్‌’. ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మించారు. అంకిత కారాట్‌ కథానాయిక. ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘‘దిస్‌ ఈజ్‌ మై దరిద్రం’’ అనే గీతాన్ని నటుడు సుడిగాలి సుధీర్‌ విడుదల చేశారు. ఈ పాటకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరాలు సమకూర్చగా.. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, మంగ్లీ సంయుక్తంగా ఆలపించారు. ‘‘ప్రేమ, వినోదంతో పాటు మదిని హత్తుకునే బలమైన భావోద్వేగాలతో నిండి ఉన్న చిత్రమిది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. కూర్పు: బొంతల నాగేశ్వర రెడ్డి, ఛాయాగ్రహణం: సాయిరామ్‌ ఉదయ్‌.


మోహన కృష్ణన్‌ కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు మెజతూర్‌ మోహనకృష్ణన్‌ (74) ఆదివారం కన్నుమూశారు. మలయాళ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన పలు టీవీ సీరియళ్లలోనూ కనిపించారు. మాలీవుడ్‌లో గొప్ప దర్శకులుగా పేరున్న లోహితదాస్‌, జయరాజ్‌ల దర్శకత్వంలో చాలా చిత్రాల్లో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. ‘తిలకం’, ‘పైత్రుకం’, ‘దేశదానమ్‌’, ‘కారుణ్యమ్‌’ తదితర చిత్రాల్లో శిఖరస్థాయి నటన ప్రదర్శించారు. ఆయన మృతి పట్ల కేరళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మోహనకృష్ణన్‌కి భార్య శోభన, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని