పండు పడిన తొలి చిత్రం అదే!

ఇటీవలే దర్శకుడిగా 45 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు రాఘవేంద్రరావు. తన తండ్రి ప్రకాశ్‌ దగ్గర దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న

Updated : 19 Jun 2020 18:41 IST

ఇటీవలే దర్శకుడిగా 45 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు రాఘవేంద్రరావు. తన తండ్రి ప్రకాశ్‌ దగ్గర దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న ఆయన ‘బాబు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. రాఘవేంద్రరావు అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది పువ్వులు, పళ్లు. అవి చెట్టుకు ఉన్నప్పటికంటే హీరోయిన్ల నాభీపై పడుతూ... తన కెమెరాకు చిక్కినప్పుడు అందంగా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదేమో. అంతగా తెరపై తనదైన ముద్ర వేశారు.

ఓ నాయిక బొడ్డుపై ద్రాక్ష పండు.. మరో భామపై యాపిల్‌ పండు.. ఇలా ప్రకృతి ప్రసాదించిన పళ్లన్నీ తన సినిమాల్లోని పాటల కోసం వినియోగించారు. నాయికలను అందంగా చూపించి వారికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. అందుకే చాలామంది భామలు ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంతకీ రాఘవేంద్రరావు పూలు, పళ్లు చూపించే ఒరవడి ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసా.

చిరంజీవి, విజయశాంతి, సుహాసిని ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘మంచిదొంగ’. ఇందులో ‘బెడ్‌ లైటు తగ్గించనా’ అనే రొమాంటిక్‌ గీతం ప్రత్యేకంగా చిత్రీకరించాలనుకున్నారు. తొలిరేయికి సంబంధించిన పాట అది. అప్పటికే ఆయన అలాంటి పాటలెన్నో గత చిత్రాల్లో చిత్రీకరించడంతో కొత్తగా చేయాలనుకున్నారు. పాటను ఎలా చిత్రీకరించాలనుకున్నారో ఊహాజనితంగా సంగీత దర్శకుడు చక్రవర్తికి చెప్పి ట్యూన్‌ చేయించారు. చిరంజీవి, విజయశాంతిల తొలిరేయి సన్నివేశం కనుక విద్యుదీపాలు చూపించాల్సిందే. అందుకే లైట్‌ ఆన్‌ చేసినపుడు ఓ బీట్‌.. ఆఫ్‌ చేసినపుడు మరో బీట్‌ వచ్చేలా రూపొందించారు. ఆ కాంతులతోపాటు తొలిసారి పళ్లు, పూలు ఈ పాట కోసమే వినియోగించారు రాఘవేంద్రరావు. అలా విజయశాంతిపై తొలిపండు పడింది. 
 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని