Ravi Teja: ‘అమ్మ.. నాన్న.. ఓ తమిళ అమ్మాయి’ వదులుకున్న హీరో ఎవరో తెలుసా!

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే ఆ సినిమా ఆఫర్‌ మొదట ఎవరికి వచ్చిందో తెలుసా!

Published : 20 Nov 2023 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ఒకటి. అందులోని పాటలు, డైలాగులు సూపర్‌ హిట్ అయ్యాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆఫర్‌ను నటుడు శ్రీరామ్‌ తిరస్కరించారట. అలా ఎందుకు చేశాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

‘కోన వెంకట్‌ నా దగ్గరకు రెండు కథలను తీసుకొచ్చారు. ‘ఒకరికి ఒకరు’, ‘అమ్మ.. నాన్న.. ఓ తమిళ అమ్మాయి’. వీటి రెండింటికీ సైన్‌ కూడా చేశాను. నన్ను హీరోగా ప్రకటించారు కూడా. అయితే అప్పుడే నేను ‘మనసెల్లాం’ అనే తమిళ సినిమా చేస్తూ ఆ షూటింగ్‌లో గాయపడ్డాను. దీంతో కొన్ని రోజులు యాక్షన్ సన్నివేశాలు చేయొద్దని డాక్టర్లు సూచించారు. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’(Amma Nanna O Tamila Ammayi)సినిమా క్లైమాక్స్‌లో ఫైటింగ్‌ సీన్ ఉంటుంది. నాకోసం ఆ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి ఆ సన్నివేశాన్ని మార్చడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే సినిమాకు న్యాయం జరగదు. అందుకే దాన్ని తిరస్కరించాను. దీంతో నా స్థానంలో రవితేజను తీసుకున్నారు. అప్పుడు రవితేజ నాకు ఫోన్‌ చేసి ‘వెండి పళ్లెంలో నాకు మంచి సినిమాను ఇస్తున్నావు’ అన్నారు. నేను నా పరిస్థితిని వివరించాను’ అని శ్రీరామ్‌ చెప్పారు.

ఆ పాత్ర నేను చేయాల్సింది.. తీసేసినందుకు బాధపడ్డా: పృథ్వీరాజ్‌

ఇక తనకు అయిన గాయాల కారణంగా చాలా సినిమాలను వదిలేసుకున్నట్లు శ్రీరామ్ వెల్లడించారు. ‘‘మనసెల్లాం’ షూటింగ్‌లో అయిన  ప్రమాదంలో నా గాయాలు చూసి చాలామంది ఇక నేను సినిమాలు చేయలేనని అనుకున్నారు. ఆ సమయంలో నేనూ ఎన్నో మంచి సినిమాలు వదిలేసుకోవాల్సి వచ్చింది. వాటిలో మణిరత్నం చిత్రాలు కూడా ఉన్నాయి. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడే 9 సినిమాలకు ఇచ్చిన అడ్వాన్స్‌లను కూడా నిర్మాతలు వెనక్కు తీసుకున్నారు. అయినా నేనేం బాధపడలేదు. దేవుడు దయ వల్ల ఆ గాయాల నుంచి కోలుకున్నాను . ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో వరుస ఆఫర్లు వచ్చాయి. అందుకే అక్కడ సెటిల్ అయ్యాను’ అని శ్రీరామ్ అన్నారు. తనకు తెలుగు సినిమాలంటే ఎంతో ప్రేమని చెప్పారు.

ఇక శ్రీరామ్‌ అసలు పేరు శ్రీకాంత్. ‘ఒకరికి ఒకరు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘పోలీస్‌ పోలీస్‌’, ‘దడ’, ‘నిప్పు’, ‘లై’, ‘రావణాసుర’ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ‘పిండం’ సినిమాలో నటిస్తున్నారు. ఇది డిసెంబర్‌ 15న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని