manchu manoj: అభిమానుల కోసం సినీతారలు ఆడే ఆట ఉస్తాద్‌

కథానాయకుడిగా వెండితెరపై వినోదం పంచిన మంచు మనోజ్‌ ఇప్పుడు ‘ఉస్తాద్‌’ షోతో వ్యాఖ్యాతగా అభిమానుల ముందుకు రానున్నారు.

Updated : 07 Dec 2023 09:48 IST

కథానాయకుడిగా వెండితెరపై వినోదం పంచిన మంచు మనోజ్‌ ఇప్పుడు ‘ఉస్తాద్‌’ షోతో వ్యాఖ్యాతగా అభిమానుల ముందుకు రానున్నారు. ర్యాంప్‌ ఆడిద్దాం...అనేది ఉపశీర్షిక. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ గేమ్‌ షోను రూపొందిస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ నెల 15నుంచి ప్రసారం కానున్న ఈ షో ప్రోమోను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘నేను మీ మనోజ్‌. నా కథ మీరు రాసుకున్నది. నా రాక మీరు పిలుస్తున్నది. ప్రతి హీరోను నడిపించే సైన్యం ఫ్యాన్స్‌. ప్రతి స్టార్‌ సంపాదించుకునే ధైర్యం ఫ్యాన్స్‌. అలాంటి ఫ్యాన్స్‌కి నేనివ్వబోతున్న రిటర్న్‌ గిప్ట్‌’ అంటూ ప్రోమోలో మనోజ్‌ చెప్పిన సంభాషణలు ఈ షోపై ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా మనోజ్‌ మాట్లాడుతూ...‘ఏడేళ్ల తర్వాత ఏడు అడుగులేసి ఇండస్ట్రీలోకి వస్తున్నాను. ఆ గ్యాప్‌లో భిన్నమైన జీవితాన్ని చూశాను. ఇప్పటి వరకు నా అభిమానులు నాకందించిన ప్రేమను ఒక బాధ్యతగా భావించి తిరిగి ఈ షోతో వారి ముందుకు వస్తున్నాను. ఈటీవీ నుంచి రామోజీరావు, బాపినీడు, సాయికృష్ణ, నితిన్‌, సాయికిరణ్‌తో పాటు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఎంతో సపోర్ట్‌ చేశారు. ఈ షో కంటెంట్‌తో మొదటిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు కాన్సెప్ట్‌ ఏంటీ అని అడిగాను. ప్రతి హీరోను ఆదరించే అభిమానుల కోసం చేసే షో అని చెప్పడంతో ఒప్పుకున్నాను. సినీతారలను అభిమానించే అభిమానుల కోసం ఒక సెలబ్రిటి ఆడే ఆట ఇది. ఫ్యాన్స్‌ కోసం ఆట ఆడి వాళ్లకు డబ్బు ఇవ్వడం అనేది గొప్ప కాన్సెప్ట్‌. అదే ఈ షో ప్రత్యేకత. రూ.50లక్షలు, ప్రత్యేక బహుమతులుంటాయి. మంచి వినోదాన్ని అందిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. మళ్లీ పుట్టి మీ ముందుకొచ్చాను’ అని అన్నారు. ‘ఈటీవీతో మా సంస్థ కలిసి పనిచేయడం గర్వకారణం. ఈ షో కాన్సెప్ట్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో మనోజ్‌ మేము ఊహించిన దానికంటే ఎక్కువ కంటెంట్‌ అందించారు’’ అని అన్నారు వివేక్‌ కూచిభొట్ల. ‘ఎన్నో ఏళ్ల దిగ్విజయ ప్రయాణం ఈటీవీది. అందులోని మరో మెట్టే ఈటీవీ విన్‌. ఈటీవీ నిర్మిస్తున్న మొట్టమొదటి నాన్‌ ఫిక్షన్‌ షో ‘ఉస్తాద్‌’. మా అందరికీ ఈ షో ఎంతో ప్రత్యేకం’ అన్నారు ఈటీవీ విన్‌ క్రియేటివ్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి. దర్శకుడు వంశీ మాట్లాడుతూ...‘మనోజ్‌ నాకు మంచి స్నేహితుడు. తను అభిమానుల నుంచి విరామం తీసుకోలేదు. వారికి ఇంకా దగ్గర కావాలని ఈ షోని ఎంపిక చేసుకున్నాడు. తను ఏది చేసిన మనసు పెట్టి చేస్తాడు. ఈ షో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాన’ని అన్నారు.ఈ కార్యక్రమంలో భూమా మౌనిక రెడ్డి, ఈటీవీ విన్‌ బిజినెస్‌హెడ్‌ సాయికృష్ణ, బీవీఎస్‌ రవి, టీజీ విశ్వ ప్రసాద్‌,  రఘనందన్‌, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని