NTR: నవ్వలేను బాబోయ్‌ అనేంతలా ‘టిల్లు స్క్వేర్‌’తో సిద్ధు నవ్వించాడు: ఎన్టీఆర్‌

‘‘సినిమా అంటే ఒక పిచ్చి ఉన్న వ్యక్తులు చిత్ర పరిశ్రమలో కొందరే ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు జొన్నలగడ్డ. తనకి సినిమా తప్ప మరొకటి తెలియదు.

Updated : 09 Apr 2024 09:39 IST

‘‘సినిమా అంటే ఒక పిచ్చి ఉన్న వ్యక్తులు చిత్ర పరిశ్రమలో కొందరే ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు జొన్నలగడ్డ. తనకి సినిమా తప్ప మరొకటి తెలియదు. సిద్ధు ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’లతో సక్సెస్‌నే కాదు.. మన జీవితంలో కలకాలం నిలిచిపోయే పాత్రనిచ్చాడు’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘టిల్లు స్క్వేర్‌’ సక్సెస్‌మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించిన చిత్రమిది. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. నేహా శెట్టి, ప్రిన్స్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘నవ్వించడమనేది ఒక వరం.. నవ్వకపోవడం ఒక శాపం. నేను నవ్వడం మొదలు పెడితే ఆపుకోవడం చాలా కష్టం. ‘అదుర్స్‌’ చేసేటప్పుడు సెట్లో బ్రహ్మానందాన్ని చూస్తేనే నవ్వేసేవాణ్ని. అలాంటిది నేను నవ్వలేను బాబోయ్‌ అనేంతలా ‘టిల్లు స్క్వేర్‌’తో సిద్ధు నన్ను నవ్వించాడు’’ అన్నారు. అనంతరం ఆయన ‘దేవర’ గురించి స్పందిస్తూ.. ‘‘సినిమా కాస్త ఆలస్యమైనా సరే ప్రేక్షకులందరూ కాలరెగరేసుకునేలా ఉంటుందని మాటిస్తున్నామ’’న్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. ‘‘వందకోట్ల క్లబ్‌లోకి వచ్చినందుకు సిద్ధు జొన్నలగడ్డకు అభినందనలు. నాలుగేళ్ల క్రితం తొలిసారి మా ఇంట్లో నాకు ‘టిల్లు’ స్క్రిప్ట్‌ చెప్పినప్పటి నుంచి సిద్ధుని చూస్తున్నా. దీనికోసం ప్రతిరోజు తను చాలా కష్టపడ్డాడు. అలాగే తొలి చిత్రం తెరకెక్కించిన విమల్‌కృష్ణ, రెండో భాగం దర్శకత్వం వహించిన మల్లిక్‌ రామ్‌.. వీళ్లంతా ‘టిల్లు’ తప్ప మరో ప్రపంచం లేదన్నట్లు పని చేశారు. ఆ కష్టానికి ఫలితమే ఈ విజయం. ఇక ఈరోజు నుంచి ఎన్టీఆర్‌ ‘దేవర’నామ సంవత్సరం మొదలు కానుంది’’ అన్నారు.  

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాపై ఇంత ప్రేమ చూపించినందుకు మా చిత్ర బృందం మొత్తానికి ధన్యవాదాలు. ఒక విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎలా ఉంటుందో.. నా జీవితంలో, ఈ చిత్ర విషయంలో త్రివిక్రమ్‌ పాత్ర అలా ఉంటుంది. ఈ ప్రయాణంలో నేను ఆయన నుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. చాలా మంది నన్ను నీకెన్ని అవార్డులు వచ్చాయని అడుగుతుంటారు. నేను వాళ్లందరికీ తారక్‌ అన్న నా డైలాగ్‌ చెప్పిన వీడియోని చూపిస్తుంటా. నా సినిమా డైలాగ్‌ను ఆయన నోటి వెంట వినడం కంటే నాకు పెద్ద అవార్డు లేదని నమ్ముతా’’ అన్నారు. ‘‘తొమ్మిది రోజుల్లో రూ:100కోట్లు వసూలు చేసింది మా చిత్రం. చాలా ఆనందంగా ఉంది. రెండేళ్లుగా మేము పడిన కష్టానికి ఇంత మంచి ఫలితం ఇచ్చి సినిమాని పెద్ద హిట్‌ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర దర్శకుడు మల్లిక్‌ రామ్‌. ఈ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్‌, ఎస్‌.రాధాకృష్ణ, విష్వక్‌ సేన్‌, నేహా, భీమ్స్‌, విమల్‌కృష్ణ, కాసర్ల శ్యామ్‌, కల్యాణ్‌ శంకర్‌, అచ్చు రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని