RRR Movie: కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్‌ పరుగు.. పులితో ఛేజింగ్‌ సీక్వెన్స్‌ ఇలా..

ఎన్టీఆర్‌ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్‌ చేసే సీన్‌ ఎలా తీశారో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కెమెరామెన్‌ సెంథిల్‌కుమార్‌ ఇటీవల పంచుకున్నారు.

Published : 20 Apr 2024 16:40 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకులుగా ఎస్.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘RRR’. బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం వివిధ పురస్కారాలతో పాటు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో చరణ్‌ రామరాజుగా నటించగా, ఎన్టీఆర్‌ కొమురం భీంగా కనిపించారు. ఇద్దరు హీరోల పరిచయ సన్నివేశాలు గూస్ బంప్స్‌ తెప్పిస్తాయి. ముఖ్యంగా పులితో ఎన్టీఆర్‌ ఛేజింగ్‌ సీన్‌ సినిమాలోని అద్భుత సన్నివేశాల్లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్‌ పులి నుంచి తప్పించుకుని దాన్ని బంధించే సీన్‌, అందులో ఆయన పరిగెత్తే తీరు అందరికీ గుర్తుండిపోతుంది. ఆ సన్నివేశాన్ని ఎలా తీశారో ‘ఆర్‌ఆర్‌ఆర్’కు కెమెరామెన్‌గా పని చేసిన సెంథిల్‌కుమార్‌ తాజాగా పంచుకున్నారు.

‘‘ఎన్టీఆర్‌ పరిచయ సన్నివేశంలో మొదట నక్క, తోడేలు, ఆ తర్వాత పులి వెంటాడాలి. ఎక్కడినుంచి ఎక్కడికి పరిగెత్తాలో ఆయనకు ముందే చెప్పి మార్క్‌ చేసి పెట్టాం. తారక్‌ పరిగెడుతున్న దిశలోనే కెమెరా ఫాలో అవుతుంది. మేము యాక్షన్‌ అని చెప్పగానే ఎన్టీఆర్‌ వాయువేగంతో వెళ్లిపోయేవారు. ఆ వేగాన్ని అందుకుంటూ ఎలా షూట్‌ చేయాలో మాకు తొలుత అర్థమే కాలేదు. అసలు తారక్‌ అంత వేగంగా పరిగెత్తగలడని నేను అనుకోలేదు. ఇదే విషయాన్ని ఆయన్ను అడిగితే, తాను జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌నని, ఆ స్టామినా కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపారు. చివరకు చేసేది లేక, ఎన్టీఆర్‌ వేగానికి సరిపోయేలా మేము ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.

జక్కన్న తరుముతూనే ఉండేవారట

అంత వేగంగా పరిగెత్తడం వెనక కారణాన్ని కూడా ఓ సందర్భంలో ఎన్టీఆర్‌ స్వయంగా చెప్పారు. జంతువలన్నీ వీఎఫ్‌ఎక్స్‌లో క్రియేట్‌ చేసినవే కానీ, ఒక జంతువు మాత్రం నా వెంటపడుతూనే ఉండేది. అదెవరో కాదు రాజమౌళి (సరదాగా నవ్వుతూ). నేను పరిగెడుతుంటే రాజమౌళి కూడా ‘ఇంకా వేగంగా..’ అంటూ వెంట పడేవారు. ‘గో గో గో గో గో..’ అంటూ అరుస్తూనే ఉండేవారు.  సినిమా, అందులోని పాత్రల కోసం నటీనటులతో ఆయన కఠినంగా ఉంటారు. ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ ఏకంగా 65 రాత్రులు షూట్‌ చేశాం. నన్ను బల్గేరియా అడవుల్లో 12 రోజుల పాటు పరిగెత్తించారు. పైగా జంతువులు పరిగెత్తే తీరు గురించి వివరించి చెప్పేవారు. ‘పులి ఎంత వేగంగా పరిగెడుతుందో తెలుసా? ఎంత దూరం దూకుతుందో తెలుసా? మనిషి కన్నా నాలుగు రెట్లు ఎక్కువ దూరం దూకుతుంది. అలాంటప్పుడు నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో ఆలోచించుకో..’’ అంటూ అనేవారని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని