Mahesh Babu: మహేశ్‌ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!

తరుణ్‌ నటించిన ఓ హిట్‌ చిత్రంలో.. ముందుగా మహేశ్‌ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్‌ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? 

Published : 02 Mar 2024 09:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శక, రచయితలు కొన్ని సందర్భాల్లో హీరోని దృష్టిలో ఉంచుకొని కథలు రాస్తుంటారు. కొన్నిసార్లు స్టోరీ సిద్ధం చేసుకుని నిర్మాతలను సంప్రదించగా.. ఇది ఫలానా నటుడికి సెట్‌ అవుతుందని వాళ్లు సలహాలిస్తుంటారు. అలా దర్శకుడు కాశీ విశ్వనాథ్‌ (Kasi Viswanath) రాసిన ప్రేమకథకు మహేశ్‌ బాబు (Mahesh Babu) బాగుంటారని ప్రముఖ నిర్మాత సురేశ్‌ దగ్గుబాటి (Suresh Babu Daggubati) సూచించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. తన కథలో హీరోగా తరుణ్‌ (Tarun)ను ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు ‘నువ్వు లేక నేను లేను’ (Nuvvu Leka Nenu Lenu).

‘‘మహేశ్‌తో సినిమా చేసేందుకు చాలామంది దర్శకులు క్యూలో ఉంటారు. ఆయన డేట్స్‌ దొరకడం కష్టం. ఇప్ప‌టికే నాకు లేట్ అయింది. ఈ క‌థ‌కి త‌రుణ్ స‌రిగ్గా స‌రిపోతాడు. పైగా ‘నువ్వే కావాలి’ చిత్రంతో హిట్ అందుకున్నాడు’’ అని సురేశ్ బాబుకి చెప్పిన‌ట్టు విశ్వనాథ్‌ ఓ ఇంట‌ర్వ్యూలో నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. 2002 జనవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. తరుణ్‌- హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌ (Aarthi Agarwal) జోడీ విశేషంగా ఆకట్టుకుంది. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

‘నచ్చావులే’, ‘రైడ్‌’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో తండ్రి పాత్రలు పోషించి మెప్పించిన కాశీ విశ్వనాథ్‌ కెరీర్‌ ప్రారంభంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కో డైరెక్టర్‌గా పని చేశారు. ‘నువ్వు లేక నేను లేను’తో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయన తెరకెక్కించిన రెండో సినిమా ‘తొలి చూపులోనే’. అందులో కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని