Amaravati: ‘వైకాపాతో జరుగుతున్న యుద్ధంలో అంతిమ విజయం అమరావతిదే’

వైకాపా ప్రభుత్వంతో చేస్తున్న యుద్ధంలో అంతిమ విజయం అమరావతిదేనని అమరావతి పరిరక్షణ సమితి నేతలు చెప్పారు.

Updated : 31 Mar 2023 14:37 IST

అమరావతి ఐకాస ధీమా
1200 రోజులకు ఉద్యమం.. మందడంలో ప్రత్యేక కార్యక్రమాలు
పాల్గొన్న వివిధ పార్టీల నేతలు

అమరావతి: వైకాపా ప్రభుత్వంతో చేస్తున్న యుద్ధంలో అంతిమ విజయం అమరావతిదేనని అమరావతి పరిరక్షణ సమితి నేతలు చెప్పారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నేటికి 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐకాస ఆధ్వర్యంలో రాజధాని పరిధిలోని మందడంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ‘దగా పడ్డ రైతులు, దోపిడీకి గురవుతున్న ఆంధ్రా పౌరులు’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో తెదేపా, భాజపా, జనసేన, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు. ఉద్యమానికి తరలిరాకపోతే చరిత్ర క్షమించదని.. వైకాపా ప్రభుత్వాన్ని పారదోలడమే తమ లక్ష్యమని ఐకాస నేతలు చెప్పారు. అనంతరం వివిధ పార్టీల నేతలు మాట్లాడారు. 

జగన్‌ ధ్యాసంతా ఆదాయంపైనే: కన్నా లక్ష్మీనారాయణ

అధికార వైకాపా తప్ప అన్ని రాజకీయ పక్షాలు అమరావతికి మద్దతిచ్చాయని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పిన జగన్‌.. ఆ తర్వాత మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత ధనికుడిగా మారాలనేదే జగన్‌ లక్ష్యం. ఇసుక దొరక్క పోవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడే పరిస్థితి వచ్చింది. సీఎంకు ప్రజల గోడు పట్టదు.. ఆయన ధ్యాసంతా ఆదాయంపైనే. వైకాపా నేతల భూకబ్జాలకు ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. జగన్‌కు దోపిడీ తప్ప.. ఇంకో పనిలేదు. సంక్షేమ కార్యక్రమాలన్నీ బూటకం. పేదలపై దోపిడీ తప్ప వారిపై జగన్‌కు అభిమానం లేదు’’ అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

ఏడో నెలలో జగన్‌ ఏడవడం ఖాయం: సీపీఐ రామకృష్ణ

అణచివేసేందుకు జగన్‌ ఎన్నో కుట్రలు చేశారని.. అయినా అమరావతి ఉద్యమం ఆగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉద్యమం ఇది అని చెప్పారు. రాజధాని అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్‌కు ఊరట లభించడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఏడో నెల(జులై)లో జగన్‌ ఏడవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల అండ లేకుండా అమరావతిలో సీఎం తిరగలేకపోతున్నారని చెప్పారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా అనుగ్రహం లేకుంటే జగన్‌ జైల్లోనే ఉంటారని.. ఆయన ఒక్కమాట చెబితే జగన్‌ అమరావతిని కాదంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. 

వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకశక్తులు కొట్టుకుపోతాయ్‌: కోటంరెడ్డి

అమరావతి నుంచి ఒక్క మట్టిపెళ్ల కూడా వైకాపా ప్రభుత్వం కదిలించలేదని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకుపోతాయని వ్యాఖ్యానించారు. ‘‘అమరావతి 29 గ్రామాలది కాదు.. ప్రపంచంలోని కోట్లాది తెలుగువారిది. అమరావతి అప్పుడు ముద్దు.. ఇప్పుడెందుకు కాదో జగన్‌ చెప్పాలి. జగన్‌ అమరావతికి జైకొడితే ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. ప్రధాని మోదీ చెబితే అమరావతి ఇక్కణ్నుంచి కదిలే అవకాశం లేదు. దేశంలోని నగరాలతో పోటీపడే శక్తి అమరావతికి ఉందని చంద్రబాబు నమ్మారు’’ అని కోటంరెడ్డి అన్నారు.

భాజపా సంపూర్ణ మద్దతు: ఆదినారాయణరెడ్డి

అమరావతి ఉద్యమానికి భాజపా సంపూర్ణ మద్దతు ఉందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. వైకాపాకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉందని చెప్పారు. ‘‘జగన్‌ విక్రమార్కుడు కాదు..విక్రయమార్కుడు. రాష్ట్రంలో ప్రతి ఒక్కటీ అమ్ముకుంటూ పోతారా?ఇలాంటి వ్యక్తి నాయకుడిగా కొనసాగితే ప్రజలు నష్టపోతారు’’ అని అన్నారు. 1200 రోజుల ఉద్యమం అంటే చిన్న విషయం కాదని భాజపాకు చెందిన మరో నేత సత్యకుమార్‌ అన్నారు. అమరావతి ఉద్యమం జగన్‌కు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య రైతులు భూములిస్తే వారిని భూస్వాములంటారా? అని మండిపడ్డారు. సీఎం ఆడే రాక్షస క్రీడలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 

మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు: పంచుమర్తి

రాజధాని ప్రాంత రైతులు 1200 రోజులుగా పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతికి అంగీకారం తెలిపిన జగన్‌.. ఆ తర్వాత మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని