అక్కసుతోనే ఇళ్లు అప్పగించడం లేదు: అచ్చెన్న

చంద్రబాబు హయాంలో కట్టించారనే అక్కసుతోనే 2 లక్షల 62 వేల మందికి ఇళ్లు అప్పగించకుండా ముఖ్యమంత్రి జగన్‌ వేధిస్తున్నారని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ..

Published : 06 Nov 2020 00:46 IST

విశాఖపట్నం: చంద్రబాబు హయాంలో కట్టించారనే అక్కసుతోనే 2 లక్షల 62 వేల మందికి ఇళ్లు అప్పగించకుండా ముఖ్యమంత్రి జగన్‌ వేధిస్తున్నారని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రూ. 1500 కోట్ల రూపాయల బకాయిలు సైతం నిలిపివేశారని మండిపడ్డారు. 17 నెలల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పంపిణీపై వైకాపా జడ్పీటీసీలు, ఎంపీపీలే కేసులు వేశారనే దానికి ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..  పాదయాత్రలో అన్నీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక హామీలను గాలికొదిలేశారని అచ్చెన్న విమర్శించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా జగన్‌ నెరవేర్చలేదని ఆరోపించారు. తెదేపా హయాంలో రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలో ఇళ్లు మంజూరు చేశామన్నారు. రూ.25 వేలుగా ఉన్న యూనిట్‌ విలువను రూ.50 వేలకు పెంచామన్నారు. అంతకు ముందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న 4లక్షల ఇళ్లను పూర్తి చేశామని గుర్తు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని