Politics: ఆయన వల్లే బెంగాల్‌లో ఈ చిక్కులు : తృణమూల్‌

పశ్చిమ బెంగాల్‌లో పొత్తులు కుదరకపోవడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి కారణమని తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఆరోపించింది.

Published : 25 Jan 2024 19:03 IST

దిల్లీ: జాతీయస్థాయిలో భాజపాను ఎదుర్కొనేందుకు ఏర్పడిన విపక్షాల కూటమి ‘ఇండియా’కి (INDIA) మమతా బెనర్జీ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ (Congress) నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో పొత్తులు కుదరకపోవడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి కారణమని తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఆరోపించింది. ఆయన తీరుతో రాష్ట్రంలో పొత్తులు కుదరలేదని విమర్శించింది.

‘‘రాష్ట్రంలో కూటమి పనిచేయకపోవడానికి అధీర్‌ రంజన్‌ కారణం. ఆయనదే పూర్తి బాధ్యత. ఇండియా కూటమికి వ్యతిరేకంగా అనేకమంది మాట్లాడుతున్నా భాజపా, అధీర్‌ రంజన్‌లు మాత్రమే వరుసగా విమర్శలు చేస్తున్నారు. అనేక అంశాల్లో భాజపాతో గొంతు కలిపి మా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లలో ఓడించగలిగితే.. కూటమిలో టీఎంసీ భాగస్వామ్యమవుతుంది’’ అని తృణమూల్‌ సీనియర్‌ నేత డెరెక్‌ ఓబ్రియెన్‌ పేర్కొన్నారు.

నీతీశ్‌ రూట్‌ మారనుందా..? మోదీని కొనియాడి, ‘ఇండియా’ పార్టీలకు చురకలు

సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్‌-తృణమూల్‌ మధ్య కొంతకాలంగా సంప్రదింపులు జరుగుతున్నాయని వార్తలు వచ్చినప్పటికీ.. కాంగ్రెస్‌ నుంచి అటువంటి ప్రయత్నాలు కనిపించడం లేదని తృణమూల్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటుపై తాను చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్‌ తోసిపుచ్చిందని, దీంతో సొంతంగానే పోటీకి దిగాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో కాంగ్రెస్‌ ఉలిక్కిపడింది. ఇండియా కూటమిలో తృణమూల్‌ ముఖ్య భాగస్వామి అని, మమత లేకుండా విపక్ష కూటమి మనుగడను ఊహించలేమని పేర్కొంది. త్వరలోనే ప్రతిష్టంభన తొలగిపోతుందని తెలిపింది. ఇలా కాంగ్రెస్‌ నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ.. సమయం మించిపోయిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని