Nitish Kumar: జేడీయూ పగ్గాలు.. మళ్లీ నీతీశ్ కుమార్‌ చేతికి

Nitish Kumar: జేడీయూ పార్టీ పగ్గాలను బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మరోసారి అందుకున్నారు. ఈ మేరకు పార్టీ సమావేశంలో ఆయనను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు.

Updated : 29 Dec 2023 19:15 IST

పట్నా: బిహార్‌ (Bihar)లోని అధికార జనతా దళ్‌ (యునైటెడ్‌) పార్టీలో నాయకత్వ మార్పు జరిగింది. జేడీయూ (JDU) నూతన జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar)ను ఎన్నుకొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లలన్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేసిన క్షణాల్లోనే నీతీశ్‌ పార్టీ పగ్గాలు అందుకున్నారు.

రెండు రోజుల పాటు జరిగే జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం దిల్లీలో శుక్రవారం ప్రారంభమైంది. దీనిలో లలన్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ నూతన అధ్యక్షుడిగా నీతీశ్ కుమార్‌ పేరును ఆయనే ప్రతిపాదించారు. ఇందుకు పార్టీ నేతలు కూడా అంగీకరించడంతో నీతీశ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకొన్నట్లు పార్టీ నేత కేసీ త్యాగీ వెల్లడించారు.

తప్పుగా అనువదించి.. క్షమాపణలు చెప్పిన సీఎం..!

జేడీయూ జాతీయ అధ్యక్ష పదవికి లలన్‌ సింగ్‌ రాజీనామా చేయనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నీతీశ్‌కు ముఖ్య సలహాదారుడిగా ఉన్న లలన్‌.. గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు దగ్గరయ్యారని ప్రచారం జరిగింది. అదే నితీశ్‌-లలన్‌ల మధ్య విభేదాలను సృష్టించిందనే ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక, పార్టీకి నీతీశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. జనతాదళ్‌లోని శరద్‌ యాదవ్‌ వర్గం, లోక్‌ శక్తి పార్టీ, సమతా పార్టీ కలిసి 2003లో జనతా దళ్‌ (యునైటెడ్‌)గా ఏర్పడ్డాయి. నాటి నుంచి 2016 వరకు శరద్‌ యాదవ్‌ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత నీతీశ్ కుమార్‌ పగ్గాలు అందుకున్నారు. నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. 2020లో ఆర్పీ సింగ్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా.. ఏడాదికే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నీతీశ్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన లలన్‌ సింగ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని