Chandrababu: ఏపీలో దళిత వ్యతిరేక ప్రభుత్వం: చంద్రబాబు

రాష్ట్రంలో సీఎం జగన్‌ పాపాలు పరాకాష్ఠకు చేరాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దళిత వైద్యాధికారి అచ్చెన్న చనిపోతే సీఎం నోరు మెదపలేదని మండిపడ్డారు.

Published : 14 Apr 2023 14:50 IST

గుడివాడ: రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌కు నిజమైన వారసుడు ఎన్టీఆరేనని చెప్పారు. 

వైకాపా పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్‌ పాపాలు పరాకాష్ఠకు చేరాయన్నారు. దళిత వైద్యాధికారి అచ్చెన్న చనిపోతే సీఎం నోరు మెదపలేదని మండిపడ్డారు. తెదేపా పాలనలో దళితుల అభ్యున్నతికి కృషి చేశామని ఆయన చెప్పారు. కేఆర్‌ నారాయణన్‌ను రాష్ట్రపతిగా ప్రతిపాదించి గెలిపించింది తెదేపానేనని తెలిపారు. దళిత నేత జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. 

అనంతరం స్థానిక తెదేపా నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవాభావంతో క్రైస్తవ సంఘాలు పనిచేస్తున్నాయని కొనియాడారు. సీఎం జగన్‌ బాధ్యతను విస్మరించి దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. పేదరిక నిర్మూలనకు క్రైస్తవ సంఘాలు కృషి చేస్తున్నాయని.. తెదేపాతో కలిసి పనిచేస్తే ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని చెప్పారు. తెదేపా హయాంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులపై దాడులు జరిగితే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని