DK Aruna: దోపిడీకి అడ్డు చెప్పకుంటే ప్రధాని మిత్రుడు.. లేదంటే శత్రువా?: డీకే అరుణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మాటలను వక్రీకరించారని.. రాష్ట్ర ప్రజలకు అన్నీ అబద్ధాలే చెబుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఎప్పుడూ రాజకీయాలు తప్ప వేరే..

Updated : 17 Aug 2022 14:17 IST

హైదరాబాద్: ప్రధాని మోదీ మాటలను సీఎం కేసీఆర్ వక్రీకరించారని.. రాష్ట్ర ప్రజలకు ఆయన అన్నీ అబద్ధాలే చెబుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్‌కు ఎప్పుడూ రాజకీయాలు తప్ప వేరే ధ్యాస లేదన్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో డీకే.అరుణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై ఆమె విమర్శలు గుప్పించారు.

కుర్చీ కాపాడుకోవాలనే యావ తప్ప వేరే ధ్యాస లేదు

‘‘దేశంలో తెలంగాణ మినహా ఇతర ఏ రాష్ట్రం బాగుపడలేదన్నట్లుగా తండ్రీకొడుకులు ప్రచారం చేస్తున్నారు. 8 ఏళ్లలో మీరు తెలంగాణ ప్రజలకు చేసిందేంటి? 1200 మంది అమరుల త్యాగాల మీద గద్దెనెక్కారు. మీరు చేసిన మోసాలకు ప్రజలు మిమ్మల్ని గద్దె దించాలని చూస్తున్నారు. ఆ భయంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కుర్చీ కాపాడుకునే యావ తప్పితే  తండ్రీకొడుకులకు వేరే ధ్యాస లేకుండా పోయింది. ఇంతకుముందు ప్రధాని మోదీ మిత్రుడు.. ఇప్పుడు శత్రువు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలి. మీరు చేసే దోపిడీకి అడ్డు చెప్పకుంటే మిత్రుడు.. లేదంటే శత్రువా?

ఎవరి కోసం అప్పులు చేశారు..

కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్నీ మీరే పూర్తి చేశారా? పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి చేయలేదు? కేసీఆర్ అబద్ధాల కోరు.. కాళేశ్వరం నీళ్లను కోటి ఎకరాలకు ఇస్తానన్నారు‌.. ఇప్పటివరకు ఇచ్చారా?  ఆయన కుటుంబం బంగారుమయం అయితే రాష్ట్ర ప్రజలకు మాత్రం అప్పులు మిగిలాయి. కేసీఆర్‌ ఎవరి కోసం అప్పు చేశారు? ప్రజలపై భారం వేస్తే ఊరుకునేది లేదు. తెరాసకు ఆదరణ దక్కడం లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో భాజపా గ్రాఫ్ పెరుగుతుందనే మా నేతలపై దాడులు చేస్తున్నారు. మీకు పాలన చేతకాకపోతే దిగిపోండి.

జగన్‌తో ఏం ఒప్పందం చేసుకున్నారు?

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో ఏపీ సీఎం జగన్‌తో ఏం ఒప్పందం చేసుకున్నారు? పక్క రాష్ట్రం వాళ్లు సంగమేశ్వర ప్రాజెక్టును ఎలా పూర్తి చేశారు? వాళ్లకు కేంద్రం అడ్డు చెప్పలేదు కానీ పాలమూరు-రంగారెడ్డికే అడ్డు చెప్పిందా? అసమర్థ, అవినీతి, కుటుంబ పాలన చూసి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యారు’’ అని డీకే అరుణ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని