అర్హులెవరూ నిరుత్సాహపడొద్దు: బొత్స

రాష్ట్రంలో 7 లక్షల పింఛన్లు తొలగించామంటూ తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి అంశంలోనూ రాజకీయ లబ్ధి పొందాలన్నదే ఆయన నైజమని విమర్శించారు.

Published : 04 Feb 2020 16:34 IST

అమరావతి: రాష్ట్రంలో 7 లక్షల పింఛన్లు తొలగించామంటూ తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి అంశంలోనూ రాజకీయ లబ్ధి పొందాలన్నదే ఆయన నైజమని విమర్శించారు. కొత్తగా 6.13లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామని చెప్పారు. సచివాలయంలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్న వ్యక్తులు పింఛను పొందేందుకు అనర్హులని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె గ్రామ సచివాలయంలోనూ అర్హులు, అనర్హుల జాబితాలు ఉంచామని.. ఇంత పారదర్శకంగా పథకాలను అమలుచేస్తుంటే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన ఏ ఒక్కరూ నిరుత్సాహ పడకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన ఐదు రోజుల్లో పింఛను మంజూరు చేస్తామని బొత్స తెలిపారు.

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై మండలి ఛైర్మన్‌ తప్పు చేస్తున్నానని చెప్పి మరీ సెలక్ట్‌ కమిటీకి పంపించారన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం ముందుకెళ్తుందని చెప్పారు. మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు లేకపోవడం దురదృష్టకరమని బొత్స అన్నారు. తెదేపా హయాంలో కేంద్ర నిధుల విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో తెదేపా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుందని.. వైకాపా మాత్రం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని