CM Kcr: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ పంద్రాగస్టు కానుక

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు కానుక ప్రకటించారు. రాష్ట్రంలో 57ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి పింఛన్లు అందజేయనున్నట్టు ప్రకటించారు. ప్రగతి భవన్‌లో

Published : 07 Aug 2022 01:54 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు కానుక ప్రకటించారు. రాష్ట్రంలో 57ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి పింఛన్లు అందజేయనున్నట్టు ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుతం 36లక్షల పింఛన్లు ఉన్నాయని, స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని కొత్తగా మరో 10లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, వీరికి కొత్తగా బార్‌కోడ్‌తో కూడిన పింఛను కార్డులు ఇస్తామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని జైళ్లశాఖను ఆదేశించినట్టు సీఎం తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు కూడా పింఛన్లు ఇస్తున్నామని, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ  డయాలసిస్‌ చేయించుకునే రోగులకు కూడా పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.

పాలమీద జీఎస్టీ రద్దు చేయాలి..

‘‘పాలమీద జీఎస్టీ రద్దు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు కూడా బీమా తెస్తున్నాం. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని కోరుతున్నాం. 28 శాతం జీఎస్టీ వల్ల బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. గాలి మీద తప్ప అన్నింటిపైనా కేంద్రం పన్ను వేస్తోంది.  అల్పాదాయ వర్గాల వస్తువులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలి. దుర్మార్గమైన చర్యకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశ ఆర్థిక ప్రగతిని కేంద్రం నాశనం చేస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులపై ఆంక్షలు విధించారు. దీనిపై నీతి ఆయోగ్‌లో ఎందుకు చర్చించరో ప్రధాని మోదీ చెప్పాలి?. నీతి ఆయోగ్‌కు రాకున్నా హైదరాబాద్‌ నుంచే అడుగుతున్నా. ఎఫ్ఆర్‌బీఎం పరిమితులు ఎత్తేయండి. రాష్ట్రాలు బలహీనంగా ఉంటే కేంద్రం కూడా బలహీనంగా ఉంటుంది. మోదీ నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రులు.. కానీ, మీ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతాం. గత ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ చిహ్నాలను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో చెబితే.. గోడకు చెప్పినట్టే. అందుకే  నిరర్థకమైన నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొనదల్చుకోలేదు. 2జీ స్ప్రెక్టంపై అప్పట్లో ఎంతో రాద్ధాం చేశారు. ఇప్పుడు 5జీ స్పెక్ట్రం సంగతి ఏంటి? రూ.5లక్షల కోట్లకు అంచనాలు రూపొందిస్తే.. రూ.1.50లక్షల కోట్లు మాత్రమే వస్తాయా?’’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts