Yuvagalam: బీసీలపై వైకాపా సర్కారు దాడులు

‘తెదేపా పాలనలో ఏనాడూ బీసీలపై దాడులు జరగలేదు. వైకాపా ప్రభుత్వం వారిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మందిపై తప్పుడు కేసులు బనాయించింది.

Updated : 03 Sep 2023 06:09 IST

యువగళం పాదయాత్రలో లోకేశ్‌

ఈనాడు, ఏలూరు, రాజమహేంద్రవరం: ‘తెదేపా పాలనలో ఏనాడూ బీసీలపై దాడులు జరగలేదు. వైకాపా ప్రభుత్వం వారిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మందిపై తప్పుడు కేసులు బనాయించింది. బీసీల తరఫున పోరాటం చేస్తున్న తెదేపా నాయకులు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర వంటి వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. జగన్‌ దొంగ లెక్కలు రాసి బీసీల ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. 202వ రోజు యువగళం పాదయాత్రను తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం విడిది కేంద్రం నుంచి శనివారం ఉదయం ప్రారంభించారు. ఆవపాడు, సింగరాజుపాలెం మీదుగా ‘తూర్పు’లో సుమారు ఆరు కిలోమీటర్లు నడిచి, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోకి ప్రవేశించారు. నిడమర్రు మండలం చిననిండ్రకొలను వరకు దాదాపు 23 కి.మీ. యాత్ర సాగింది. మధ్యాహ్నం ఉంగుటూరులో భోజన విరామం అనంతరం బీసీ సామాజిక వర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు.

కుల, చేతివృత్తులను రక్షిస్తాం

‘తెదేపా హయంలో బీసీలకు సబ్‌ప్లాన్‌ తెచ్చి నిధులు కేటాయించాం. కార్పొరేషన్‌ రుణాలూ అందించాం. స్థానిక సంస్థల్లో 24 శాతం రిజర్వేషన్‌ను 34 శాతానికి పెంచిందీ తెదేపానే’ అని లోకేశ్‌ వివరించారు. ‘తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెలు కొనడానికి రాయితీలు అందిస్తాం. రజకులకు విద్యుత్తు ఉచితంగా ఇస్తాం. కొల్లేరుపై ఆధారపడుతున్న వారి సంక్షేమానికి కృషి చేస్తాం. మత్స్యకారుల సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం. ఓబీసీల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం’ అని లోకేశ్‌ బీసీ వర్గీయులకు భరోసా ఇచ్చారు. 

వైకాపా నేతల చేరిక

ఉంగుటూరులో వైకాపా నేతలు వేగేశ్న రంగరాజు, సోడిపల్లి రాజంరాజు, పచ్చ కృష్ణ, నూకల వెంకటేశ్‌, శ్రీనివాసరాజు, తమ్మిన నాగేశ్వరరావు తదితరులు లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు.

దళితుల పథకాలు రద్దు చేశారు

దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను వైకాపా రద్దు చేసిందని లోకేశ్‌ విమర్శించారు. సింగరాజుపాలెం వద్ద పలువురు దళిత యువకులు లోకేశ్‌ను కలిసి సమస్యలు విన్నవించారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్‌ వారికి తెలిపారు.

నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌లో లోకేశ్‌పై కేసు

దేవరపల్లి, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల ఫిర్యాదు మేరకు లోకేశ్‌తో పాటు యువగళంలోని మరికొందరు సభ్యులపై తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నల్లజర్ల మండలం తిమ్మనపాలెం వద్ద శనివారం సీఎం జగన్‌ ఫ్లెక్సీని లోకేశ్‌ తొలగించమని ఆదేశించడంతో యువగళం సభ్యులు ధ్వంసం చేశారని, అడ్డుకొనేందుకు యత్నించిన తమపై దాడి చేశారని రాచగర్ల వెంకట రమణరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • తిమ్మనపాలేనికి చెందిన జలపర్తి భార్గవ, మరికొందరు తనను చంపేందుకు యత్నించారని వైకాపా నాయకుడు టి.సోమేశ్వరరావు ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. నల్లజర్ల కూడలిలో యువగళం పాదయాత్ర వెళ్తుండగా.. ఆలపాటి సాగర్‌, మండ పవన్‌ తదితరులు వచ్చి తమ ద్విచక్ర వాహనాలపై ఉన్న వైకాపా స్టికర్లు తొలగించేందుకు యత్నించారని ఓలేటి శ్రీను అనే వ్యక్తి ఫిర్యాదుచేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వైకాపా నాయకులు, పోలీసులపై ఫిర్యాదు

నల్లజర్ల, న్యూస్‌టుడే: పాదయాత్రను ఎలా అడ్డుకోవాలో తెలియక వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నాలు, గ్రూపులు మధ్య తగాదాలు పెడుతున్నారని గోపాలపురం తెదేపా ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకట రాజు ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిమ్మన్నపాలెంలో చంద్రబాబు, లోకేశ్‌లను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, దానికి పోలీసులే రక్షణ కవచంగా ఉన్నారన్నారు. వారిని ప్రోత్సహించేలా వ్యవహరించిన పోలీసులపై విచారణ చేపట్టాలని నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని