సంక్షిప్త వార్తలు

పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 28 Apr 2024 06:49 IST

నేటి నుంచి ఇంటింటికీ భాజపా

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. బూత్‌ విజయ్‌ అభియాన్‌ మేరకు ఇంటింటికీ భాజపా రెండో విడత ప్రచారం 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల విడుదల చేసిన సంకల్పపత్రాన్ని ఇంటింటికీ అందజేస్తారని పేర్కొన్నారు. దీంతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థి కరపత్రం, స్టిక్కర్‌ ప్రతి ఇంటికీ అతికిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ప్రత్యేకంగా కలుస్తారన్నారు. పోలింగ్‌ బూత్‌ సమావేశం, ఓట్ల పరిశీలన కూడా చేస్తారని తెలిపారు.


అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పీసీసీ అధికార ప్రతినిధులు, పీసీసీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులకు సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ శనివారం ప్రకటన విడుదల చేశారు.


మోదీ గెలుపుతో ఉగ్రవాద విముక్తి

ఉగ్రవాదం, నక్సలిజం, పేదరికాల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మరోసారి ప్రధానిగా మోదీకే పట్టంకట్టాలి. ఓటుబ్యాంకు రాజకీయాలకు అతీతంగా గత పదేళ్లలో ఎన్నో కఠిన నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఆదివాసీలకు వ్యతిరేకం. ప్రజలను దోచుకోవడానికే అవి చేతులు కలిపాయి.

గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో కేంద్రమంత్రి అమిత్‌షా


భాజపా పరిస్థితి మరింత దిగజారుతుంది

యూపీలో తదుపరి దశల్లో జరగనున్న పోలింగ్‌లో భాజపా పరిస్థితి మరింత దిగజారుతుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలే దీనికి కారణం. ఉద్యోగ నియామకాలు జరిగితే వాటిలో రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందనే కారణంతోనే యూపీలో భాజపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ నియామక పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు పది సందర్భాల్లో ఇలా జరిగింది.

‘ఎక్స్‌’లో, యూపీలోని కన్నౌజ్‌లో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌


నాకోసం దేశం ఎదురుచూస్తోంది

నిత్యం ప్రజల మధ్య ఉండే నేను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. అమేఠీ సిటింగ్‌ ఎంపీ స్మృతి ఇరానీ తానిచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న భాజపాను వదిలించుకోవాలని అనుకుంటున్నారు. రాహుల్‌, ప్రియాంక శ్రమిస్తున్న తీరును చూసిన వారు గాంధీ కుటుంబానికి అండగా ఉంటారు.

విలేకరులతో రాబర్ట్‌ వాద్రా
ప్రియాంకా గాంధీ భర్త


 

ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు కేరళలో సీపీఎం కుట్ర: కాంగ్రెస్‌

తిరువనంతపురం: కేరళలో ఓటింగ్‌ శాతం తగ్గేలా ఎన్నికల యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం, ఓటర్లను ఇబ్బందులకు గురిచేయడం ద్వారా అధికార సీపీఎం దుశ్చర్యలకు పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ- ఎండలో ఉన్న ఓటర్లకు తాగునీరు వంటి కనీస సదుపాయాలైనా కేరళలో కల్పించలేదని విమర్శించారు. ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయడమే దీని ప్రధానోద్దేశమన్నారు.


అయోధ్య పర్యటనతో కాంగ్రెస్‌ కొత్త నాటకం

రామమందిర ప్రాణప్రతిష్టకు కేంద్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌ నేతలు.. ఎన్నికల వేళ అయోధ్య పర్యటన పేరుతో కొత్త నాటకానికి తెర లేపుతున్నారు. రాముడి పేరు ఉపయోగించుకుని ఓట్లు అడిగేందుకే ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే ఇప్పుడు పర్యటనకు రాహుల్‌ సిద్ధమయ్యారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ


పేదలకు ఆకలిమంటలు.. ఉగ్రవాదులకు బిర్యానీ

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఆకలిమంటలు మిగిలేవి.. ఉగ్రవాదులకు మాత్రం ఆ పార్టీ బిర్యానీ తినిపించేది. పేదలు, రైతులు, మహిళలు, యువత అనే నాలుగు వర్గాలకు కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ ఎజెండాల్లో చోటులేదు. సమాజాన్ని విభజించి ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడమే వాటి పని.

యూపీలో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని