పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు

కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయించి, ఉపఎన్నికల్లో కొట్లాడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.30 దోచుకుంటూ.. కేంద్రం

Updated : 12 Aug 2022 06:24 IST

ఉపఎన్నికల్లో తేల్చుకుందాం

కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌

ఈనాడు, నల్గొండ- న్యూస్‌టుడే, రామన్నపేట: కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయించి, ఉపఎన్నికల్లో కొట్లాడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.30 దోచుకుంటూ.. కేంద్రం ధరల పెంపుపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరడంపై తెరాస నాయకులు విమర్శలు చేయడంపై మండిపడ్డారు. పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే ఆయన భాజపాలో చేరుతున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మునుగోడులో భాజపా విజయం ఖాయమైపోయిందన్నారు. రాష్ట్రంలో మరో 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు (ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌రైస్‌) బియ్యాన్ని సేకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాదయాత్రలో సంజయ్‌తో పాటు ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు పాల్గొని మాట్లాడారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

13.5 కి.మీ. సాగిన పాదయాత్ర

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం వద్ద ప్రారంభమైన బండి సంజయ్‌ పాదయాత్ర రామన్నపేట మీదుగా దుబ్బాక, మునిపంపుల వరకు 13.5 కి.మీ. మేర సాగింది. రామన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏల సమ్మె శిబిరం వద్దకు బండి వెళ్లి.. వారికి మద్దతు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు సంజయ్‌కు వినతిపత్రం అందజేయగా.. రానున్న భాజపా ప్రభుత్వంలో తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ యాత్ర రామన్నపేటకు చేరుకునే సమయంలో పెట్రో ధరలు తగ్గించాలని కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఫ్లకార్డులతో నిరసన తెలపగా.. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

మునుగోడుపై నేడు భాజపా సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికకు సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కమలదళం శుక్రవారం సమావేశం నిర్వహిస్తోంది. పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీ నేతలు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ప్రస్తుతం బండి సంజయ్‌ పాదయాత్ర జరుగుతోంది. దీంతో ఆ మార్గంలోని యెన్నారంలో ఈ భేటీ ఏర్పాటు చేశారు.  మునుగోడు ఉపఎన్నిక అంశంతో పాటు, పార్టీ నాయకులు నిర్వహిస్తున్న బైక్‌ ర్యాలీలపై ఈ సమావేశంలో సమీక్షిస్తారు. ఉపఎన్నికకు కమిటీల ఏర్పాటు, నియోజకవర్గానికి రాష్ట్రస్థాయి నాయకుల రాక, 21న నిర్వహించే అమిత్‌షా సభకు ఏర్పాట్లు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. భాజపాలోకి చేరికలు, ప్రజా సమస్యలు, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై వేసిన కమిటీల నాయకులతోనూ మరో సమావేశం నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని