వైకాపా ప్రభుత్వం అబద్ధాలు నిజం చేసే ప్రయత్నం చేస్తోంది

అబద్ధాలు చెప్పీ చెప్పీ ఏపీలోని వైకాపా ప్రభుత్వం వాటిని నిజం చేసే ప్రయత్నం చేస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated : 08 Dec 2022 06:09 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: అబద్ధాలు చెప్పీ చెప్పీ ఏపీలోని వైకాపా ప్రభుత్వం వాటిని నిజం చేసే ప్రయత్నం చేస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని నిడమర్రులో బుధవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అబద్ధం పదిసార్లు చెప్పి నిజమని భావించే వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అడ్డంగా దొరికిపోయారు, దోచేశారని నాపై, మా నాయకుడు చంద్రబాబునాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. వాటిని 24 గంటల్లో నిరూపించాలని అప్పుడే ట్వీట్‌ పెట్టాను. నాకు గుర్తున్నంత వరకు ఏడు అంశాలకు సంబంధించి నాపై వైకాపా నాయకులు ఆరోపణలు చేశారు. మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు గడిచినా ఎందుకు వాటిని రుజువు చేయలేకపోయారు? మీ నాయకుడిలాగా నేను పారిపోవడం లేదు. ధైర్యంగా ప్రెస్‌మీట్‌ పెట్టి సవాల్‌ చేశాను. మీ నాయకుడు రూ.లక్ష కోట్లు తిన్నారు. 16 నెలలు జైలుకెళ్లారు. ఆయన అవినీతిపరుడు. అందుకే ప్రజలందరూ అవినీతి చేశారన్న భావనలో జగన్‌రెడ్డి ఉంటారు...’ అని తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత తెదేపాకు చెందిన 55 మంది సీనియర్‌ నాయకులపై కేసులు పెట్టారని, ఒక్క కేసు కూడా మీరు నిరూపించలేకపోయారన్నారు. ‘ఆరోపణలు రుజువు చేయడానికి కావాలంటే మరో 24 గంటలు సమయం ఇస్తాను నిరూపించండి. ఏడు అంశాలే కాదు నా జీవితంలో తప్పు చేసినట్లు భావిస్తే ఏ విషయంలోనైనా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టమని మళ్లీ సవాల్‌ చేస్తున్నాను...’ అని లోకేశ్‌ చెప్పారు. తప్పనిసరిగా డిఫమేషన్‌ కేసు వేస్తానని వెల్లడించారు. తెలుగుదేశం ‘జయహో బీసీ’పై పాట కూడా రూపొందించిందని, కావాలంటే ఇస్తామని, జగన్‌మోహనరెడ్డిని తీసుకోమనండి అని లోకేశ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని