DK Shivakumar: ఒకే స్థానం నుంచి డీకే బ్రదర్స్‌ నామినేషన్‌.. కారణం ఇదేనట..!

కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar) పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానం నుంచి ఆయన సోదరుడు డీకే సురేష్‌ నేడు నామినేషన్‌ దాఖలు చేయడం ఆసక్తిగా మారింది.

Published : 21 Apr 2023 01:44 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Election 2023) పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ గడువు నేటితో ముగిసింది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఆయా స్థానాలనుంచి రంగంలోకి దించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ (Congress) పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరు రూరల్‌ ఎంపీగా ఉన్న కాంగ్రెస్‌ నేత డీకే సురేష్‌ (DK Suresh).. కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి ఆయన సోదరుడు, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్‌ వేశారు. ఇలా డీకే బ్రదర్స్‌ ఒకేచోట నుంచి ఎందుకు నామినేషన్‌ వేశారనే విషయం ఆసక్తిగా మారింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కనకపుర నియోజకవర్గం నుంచి ఏప్రిల్‌ 17న నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి డీకే సురేష్‌ కూడా పోటీ చేస్తున్నట్లు కర్ణాటక కాంగ్రెస్‌ వెల్లడించింది. ఇలా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు సోదరులు ఒకే స్థానం నుంచి నామినేషన్లు దాఖలు చేయడంపై ఆసక్తి నెలకొంది. అయితే, ఒకవేళ డీకే శివకుమార్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైతే బ్యాకప్‌ ప్రణాళికలో భాగంగా ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

కర్ణాటక నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన ఒకే ఒక్క ఎంపీ డీకే సురేష్‌ కావడం విశేషం. జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్‌కి వ్యతిరేకంగా రామనగర స్థానం నుంచి సురేష్‌ పోటీకి దిగుతారనే వార్తలు వినిపించాయి. అంతేకాకుండా శివకుమార్‌ పోటీ చేస్తున్న కనకపుర నియోజగవర్గం నుంచి ఓ బలమైన అభ్యర్థిని భాజపా దింపుతుందనే ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సురేష్‌ను పద్మనాభనగర్‌ నుంచి రంగంలోకి దించేందుకు పార్టీ సిద్ధమైంది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం సురేష్‌కు ఇష్టం లేదు. ఇలా భిన్న వాదనల నేపథ్యంలో శివకుమార్‌ పోటీచేస్తున్న స్థానం నుంచే సురేష్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని