KCR: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం: సీఎం కేసీఆర్‌

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ఓటేసే ముందు బాగా ఆలోచించి వేయాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Updated : 07 Nov 2023 17:41 IST

మంథని: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ఓటేసే ముందు బాగా ఆలోచించి వేయాలని భారాస అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భారాస పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. మంథనిలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని కేసీఆర్‌ మాట్లాడారు. పార్టీ అభ్యర్థి పుట్ట మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

‘‘జనం గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి. పార్టీల చరిత్రలు చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది. గిరిజన, ఆదివాసీల విషయంలో కాంగ్రెస్‌ సరైన విధానాలను అవలంబించలేదు. పీవీ మొదలుపెట్టిన రింగ్‌రోడ్డును పుట్ట మధు పూర్తి చేశారు’’ అని కేసీఆర్‌ తెలిపారు. రూ.1000 కోట్ల ప్రత్యేక నిధితో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్య ఐక్యత లోపిస్తోందని, అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ‘‘ బీసీ బిడ్డను గెలిపించాలని మంథని ప్రజలతో పంచాయతీ పెట్టుకుంటా. అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని కేసీఆర్‌ అన్నారు. 

మేనిఫెస్టోలో లేకపోయినా ఎన్నో చేశాం..

ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా నీటి తీరువా బకాయిలు రద్దు చేశామని, నీటి తీరువా పన్ను కూడా ఎత్తివేశామని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ తెలిపారు. పెద్దపల్లిలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి మనోహర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వ్యవసాయానికి కచ్చితంగా ప్రభుత్వ మద్దతు అవసరమని, అందుకే 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు.

విదేశాల్లో సీటొస్తే.. విద్యార్థులకు రూ.20 లక్షలు ఇచ్చామని, జిల్లాకో మెడికల్‌ కళాశాల తీసుకొచ్చామని కేసీఆర్‌ చెప్పారు. ‘‘ కేంద్రం ప్రభుత్వం ఒక్క మెడికల్‌ కళాశాల కూడా ఇవ్వలేదు. ప్రజల డబ్బును ప్రజలకోసం వాడితే అభివృద్ధి ఇలాగే ఉంటుంది. భారాసకు మతం లేదు..కులం లేదు. అన్ని వర్గాలను కలుపుతూ వెళ్తున్నాం. 75 ఏళ్ల క్రితమే దళితులకు ప్రత్యేక పథకాలు తీసుకొస్తే.. ఇప్పుడు వాళ్ల పరిస్థితులు ఇలా ఉండేవా? అందుకే దళితబంధును తీసుకొచ్చాం’’ అని కేసీఆర్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని